Another Student Dead in Rajasthan’s Kota: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆత్మహత్యలకు అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. జేఈఈకి సిద్ధమవుతోన్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఏడాదిలో ఇది నాలుగో మరణం. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు అందరినీ కలవరపెడుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… ఝార్ఖండ్‌కు చెందిన శుభ్ చౌధరీ రెండేళ్లుగా జేఈఈకి సిద్ధమవుతున్నాడు. మంగళవారం జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చాయి. ఈ పరీక్షలో శుభ్ అంచనాకు తగ్గట్టుగా మార్కులు సాధించలేకపోయాడు. ఫలితాలు చూసుకున్న తర్వాత తన గదికి వెళ్ళాడు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో.. వారు వార్డెన్‌ను సంప్రదించారు. వార్డెన్ వెళ్లేసరికి సీలింగ్‌కు ఉరేసుకొని అతడు వేలాడుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహంను స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్ష తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.
Also Read: Delhi Chalo: అరగంటలో బారికేడ్లను బద్దలుకొడతాం అంటూ.. ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ప్రారంభించిన రైతులు!
కోటాలో 2023లో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంజినీరింగ్ మరియు మెడికల్ ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు కోటా పేరుగాంచింది. ఏటా దేశ నలుమూలల నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు కోటాకు వస్తుంటారు. నీట్‌తో పాటు జేఈఈ శిక్షణ కోసం విద్యార్థులు ఇక్కడి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతారు. అయితే మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక విద్యార్థులు హాస్టళ్లలో ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.