తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్. ఇవాళ ఆయన పెద్దపల్లిలో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ఏ ప్రాంతం చూసిన రైతుల కష్టాలు కనబడుతున్నాయన్నారు. తుల పంట పొలాలు ఎండుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. రైతుల కోసం 36 గంటల నిరసన దీక్షను చేపట్టామని, ఈ దీక్ష తోనైనా ఎండిన పంటలకు ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎండుతున్న పంటలను సాగు నీరు అందించి కాపాడాలన్నారు కొప్పుల ఈశ్వర్. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎలా ఉండెనో మళ్లీ అదే పరిస్థితులు ఎదురవుతున్నాయని, కేసీఆర్ రైతుల పక్షపాతిగా పని చేసిన వ్యక్తి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులను అభివృద్ది వైపు నడిపించిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు కొప్పుల ఈశ్వర్. రైతులకు న్యాయం జరిగేంత వరకు బి అర్ ఎస్ పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా..’కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయం పండుగలా మారింది. పుష్కలమైన నీళ్లు, 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలతో సంబురంగా సాగింది. కానీ, కాంగ్రెస్ సర్కారు వంద రోజుల పాలనలో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా సాగునీటి గోస తీవ్రమవుతున్నది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేలకు పైగా ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. చేతికి వచ్చే దశలో దెబ్బతిన్నాయి. మున్ముందు పరిస్థితులు మరింత దారుణంగా ఉండనున్నాయి. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. స్థానికంగా ఉండే పాలకులు కూడా కనీసం కన్నెత్తి చూడలేదు.’ అని ఆయన అన్నారు.
