OTR: రాఖీతో పొలిటికల్‌ బంధం బలపడుతుందా..

  • కొండా సురేఖ కేంద్రంగా వారం నుంచి పొలిటికల్ హీట్‌..
  • కేబినెట్‌ నుంచి తప్పించడం ఖాయమంటూ విశ్లేషణలు..
  • సీఎం రేవంత్‌తో పాటు మనవడికి కూడా కొండా బంగారు రాఖీ
Rakhi

Rakhi

రాఖీతో పొలిటికల్‌ బంధం బలపడుతుందా..? లేక పండగ పండగే.. రాజకీయం రాజకీయమేనని అంటారా? తెలంగాణ సీఎంకు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖకు ఎలాంటి గిఫ్ట్‌ అందబోతోంది? పండగపూట ఫీలింగ్స్ బయట పడకుండా ఇద్దరూ జాగ్రత్త పడ్డారా..!? అసలా విషయంలో రాజకీయవర్గాలు ఏమంటున్నాయి?

రక్షా బంధన్… సోదరీ సోదరుల ప్రేమలకు ప్రతీక. ప్రేమతో ఒకరు, ఆ ప్రేమకు భరోసాను కూడా కలిపి పంచేది మరొకరు. ఇది లోక సహజమైన వ్యవహారం. కానీ… పొలిటికల్ రక్షాబంధన్‌లు మాత్రం ఎప్పుడూ కాస్త తేడాగానే కనిపిస్తూ ఉంటాయంటారు చాలామంంది. పండగ పండగే… రాజకీయం రాజకీయమే అన్నట్టు ఉంటుంది వ్యవహారం. ఇప్పుడీ చర్చంతా.. ఎందుకంటే…గడిచిన వారం రోజులుగా తెలంగాణ రాజకీయమంతా మంత్రి కొండా సురేఖ చుట్టూనే తిరుగుతోంది. ఆమె మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయని, కచ్చితంగా కేబినెట్‌ నుంచి తప్పిస్తారని రకరకాల విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి… ఆయనకు రాఖీ కట్టారు కొండా సురేఖ. మరో మంత్రి సీతక్కతో కలిసి వెళ్లిన కొండా… రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడికి కూడా బంగారు రాఖీ కట్టారు. వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను, ప్రస్తుత సన్నివేశాలను బేరీజు వేసి చూస్తున్న రాజకీయవర్గాలు… రాఖీ మారుస్తుందా? మార్పు మొదలైందా అంటూ గుసగుసలాడుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై మంత్రి కుమార్తె కొండా సుస్మిత చేసిన ఆరోపణల పంచాయితీ తారా స్థాయికి చేరింది. సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది కూడా.

ఇలాంటి సమయంలో వచ్చిన రాఖీ పండగ….. సీఎంకు, మంత్రికి మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చిందా అంటూ చర్చలు జరుగుతున్నాయి. గ్యాప్‌ పూడటం మొదలైనట్టేనా? లేక రాఖీ రాఖీనే, రాజకీయం రాజకీయమే అన్నట్టుగా ఉంటుందా అన్నది ఎక్కువ మందికి వస్తున్న డౌట్‌. అయితే… ఈ సన్నివేశాన్ని చూస్తున్న వాళ్ళు మాత్రం… పండగ వేళ ఇటు సీఎం రేవంత్ రెడ్డి.. అటు మంత్రి కొండా సురేఖ… ఇద్దరూ సంయమనంతో వ్యవహరించారంటూ కామెంట్‌ చేస్తున్నారు. విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న సంగతి పక్కనపెట్టి… పండగ రోజున కొండాకు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం, ఆమె కూడా వచ్చి హుందాగా రాఖీకట్టి వెళ్ళిపోవడం మంచి పరిణామమేనని అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోయి ఉంటేగనుక… వ్యవహారం మొత్తం దాని చుట్టూనే తిరిగేది. కానీ… ఈ పరిణామంతో… సమస్య సంగతి ఎలా ఉన్నా.. మంత్రి విషయంలో సీఎం గౌరవంగానే వ్యవహరించారన్న చర్చ తెరమీదకు వచ్చింది.

పండగ పూట రాజకీయాలు మాట్లాడబోనంటూ కొండా సురేఖ కూడా తెలివిగా వ్యవహరించారని అంటున్నారు. రాఖీ పండుగ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు తెలంగాణలోని ఆడపడుచులు అందరికీ ఉండాలని కోరారు సురేఖ. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్‌లో ఆ ఆశీస్సులు సురేఖకు ఉన్నాయా అన్న ప్రశ్నకి… రెండిటిని వేరువేరుగా చూడొద్దంటూ లాజికల్‌ ఆన్సర్‌ చెప్పేశారామె. మొత్తం మీద రాజకీయ పంచాయతీ ఎలా ఉన్నా… పండగ పూట ఇద్దరు కనీసం ఫీలింగ్స్ కూడా బయటపడకుండా బాగానే మెయింటైన్ చేసినట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు. పాలిటిక్స్‌లో శాశ్వత మిత్రులు…శాశ్వత శత్రువులు ఉండరు. మరి కొండా సురేఖ ఎపిసోడ్‌లో నెక్స్ట్ ఏం జరగబోతోంది..? రాఖీ పండగ కలిసొచ్చిందా లేదా అన్నది తేలాలంటే… కాస్త ఆగాలని అంటున్నారు పరిశీలకులు.