Devi Priyanka in Jana Sena ZP Chairman Race: అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య అభ్యర్థి ఎంపిక వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే మూడు పార్టీలకు చెందిన ముగ్గురు మహిళా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. తాజాగా మరో అభ్యర్థి తెరపైకి రావడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమార్తె దేవీ ప్రియాంక తాజాగా జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. దీంతో కోనసీమ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ముగ్గురు మహిళా అభ్యర్థులు పోటీలో ఉండగా.. దేవీ ప్రియాంక నాలుగో అభ్యర్థిగా రంగంలోకి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
దేవీ ప్రియాంకకు జనసేన పార్టీ బీఫారం ఇవ్వబోతున్నారనే ప్రచారం స్థానికంగా రాజకీయ దుమారం రేపుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తెకు టికెట్ ఇవ్వడంపై స్థానిక జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆమెకు పార్టీ బీఫారం ఇస్తే అంగీకరించేది లేదని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు మహిళా అభ్యర్థుల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో.. తాజాగా దేవీ ప్రియాంక నామినేషన్ వేయడంతో కూటమి పార్టీల్లో అభ్యర్థి ఎంపిక అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. జనసేన నుంచి ఆమెకు బీఫారం ఇస్తారా?, స్థానిక నాయకుల అభ్యంతరాలను పార్టీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

