నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గల్లీ నుండి నన్ను ఢిల్లీ వరకు పంపిన మీకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం నా ప్రాణాలైన ఇస్తానని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నాకు కొడుకు లేడు.. మీరే నా వారసులు అని, సీఎం వద్ద ఏ పని కావాలన్నా నేను చేసుకొస్తా.. భారీ మెజార్టీ మీరు ఇవ్వండన్నారు మంత్రి కోమటిరెడ్డి. కేటీఆర్, కేసీఆర్ మానసిక పరిస్థితి దిగజారి పోయిందని, బీఆర్‌ఎస్ కు ఓటేస్తే మూసిలో వేసినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది… రాహుల్ ప్రధాని అవుతున్నారని, ఆగష్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేయకపోతే దేనికైనా సిద్దమేనన్నారు.
అగ్గిపెట్టె రావు మరోసారి మోసం చేసేందుకు వస్తుండు అని ఆయన వ్యాఖ్యానించారు. తనను గల్లీ నుంచి ఢిల్లీకి పంపిన కార్యకర్తలకు తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నాలుగు నెలల్లో వెయ్యి కోట్ల నిధులు తెచ్చానని చెప్పారు. రూ. 700 కోట్లతో నల్గొండ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగబోతుందని చెప్పారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వార్డుకో వాలింటరీ వ్యవస్థ రాబోతుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో రెండు వందల ఎకరాల్లో పది వేల ఇళ్లు కడుతున్నామని చెప్పారు.