Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : అర్హులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతాయి

Komatireddy

Komatireddy

ఆరు గ్యారంటీలు, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయాక సహనం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అర్హులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన వెల్లడించారు. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తాం… బిఆర్ఎస్ నేతలు చూస్తూ కూర్చోండని ఆయన వ్యాఖ్యానించారు. 5 సంవత్సరాలలో అందరూ ఆశ్చర్యపోయే రీతిలో అబివృద్ది చేస్తామని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనుండి వారంలో రెండు రోజుల నల్గొండలోనే అందుబాటులో ఉంటానని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.

ప్రజాస్వామ్య రాజకీయ ప్రక్రియలో గెలుపు, ఓటములను సమానంగా అంగీకరించే పరిణతి అవసరం. We may be personally defeated, but our principles never! అంటాడు ప్రఖ్యాత అమెరికన్ జర్నలిస్ట్ విలియమ్స్ లాయిడ్ గ్యారిసన్. దురదృష్టం కొద్ది ప్రతిపక్ష పార్టీ ఓటమిని, ప్రజాతీర్పును అంగీకరించలేకపోతోంది. ఓటమి అన్నది ఏదో ఒక ఎన్నికలో వచ్చేది కాదు, నాయకులుగా మనం కోల్పోయే సిద్ధాంత వైఫల్యం వల్ల కూడా అన్న సంగతిని ఏ నాయకుడు మరువకూడదు. బీఆర్ఎస్ పార్టీ విలువల్ని పూర్తిగా విడిచిపెట్టింది. అధికారంలో ఉండగా ప్రజాస్వేచ్ఛను హరించి, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి, అవినీతి, అక్రమాలకు వంతపాడి, నియంతృత్వ విధానాలు అవలంబించి, చెయ్యరాని తప్పులన్నీ చేసి.. ఇప్పుడు ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారపక్షం మీద ఎదురుదాడి చేస్తున్నది. వీటిని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తున్నది.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ప్రజలకు వివరించేందుకు శ్వేతపత్రం విడుదల చేయడం ప్రధాన ప్రతిపక్షానికి మింగుడు పడటం లేదు. ఏమాత్రం సంయమనం పాటించకుండా, కనీస పరిణతి ప్రదర్శించకుండా స్టేట్మెంట్లు ఇచ్చారు. శ్వేతపత్రంలో మీరు తేల్చేది ఏంలేదు, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరంటూ ముందే హేళనగా మాట్లాడటం వారిలో గూడుకట్టుకున్న నియంతృత్వ భావజాలానికి నిలువెత్తు నిదర్శనం. శ్వేతపత్రం ద్వారా వారి బండారం మొత్తం తెలంగాణ ప్రజానీకానికి తెలియగానే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు స్వేదపత్రం పేరుతో, 420 హమీల పేరుతో హద్దులు దాటి ప్రవర్తించడం వారి మానసిక స్థితికి అద్దం పట్టింది. తెలంగాణకు దళితుడే ముఖ్యమంత్రి, కేజీటూపీజీ ఉచిత విద్య, ప్రతీ రైతుకు ఉచిత ఎరువులు, ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీళ్లు, ధాన్యానికి గిట్టుబాటు ధరలు అంటూ వందల అబద్ధాలు చెప్పి జనం నోట్లో మట్టికొట్టిన బీఆర్ఎస్ నాయకులు నెలరోజుల కాంగ్రెస్ ప్రభుత్వంపై పుస్తకాలమీద పుస్తకాలు తీసి బదనాం చేయాలనే రాక్షస ప్రయత్నం చేయడం వారికే చెల్లింది. అని వెంకట్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version