Sharmishta Panoli: కోల్కతాకు చెందిన 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి కోల్కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆపరేషన్ సిందూర్ పై వివాదాస్పదంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను గత వారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మే 31న శర్మిష్ట పనోలి గురుగ్రామ్ లో అరెస్ట్ అయ్యింది. ఆమె ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పహల్గాం దాడి తరువాత భారత సైన్యం చేపట్టిన చర్యలపై ప్రశ్నించిన ఒక పోస్ట్‌కు సమాధానంగా సామాజిక, మత పరమైన ఉద్రేకం కలిగించే వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యాఖ్యలపై వజాహత్ ఖాన్ ఖాద్రి అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా.. కోల్కతా పోలీసులు కేసు నమోదు చేసి పనోలిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అలాగే ఈ ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ ఖాద్రిపై కూడా మతసంబంధిత భావోద్వేగాలను దెబ్బతీసేలా పోస్టులు పెట్టినట్టు కేసులు నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి అస్సాం పోలీసు బృందం కోల్కతాకు చేరుకొని ఖాద్రిపై అరెస్ట్ వారంట్‌ను అమలు చేయడానికి ప్రయత్నించినా.. అక్కడ ఆయన ఇంట్లో లేరని వెల్లడించారు. ఆయనపై ఇతర రాష్ట్రాల్లో కూడా పలు కేసులు ఉన్నాయి.
Read Also: IND vs ENG: భారత్‌తో జరిగే తొలి టెస్ట్‌కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్..!
శర్మిష్ట పనోలి అరెస్టు రాజకీయంగా భారీ దుమారాన్ని రేపింది. బీజేపీ సహా ఇతర పార్టీలు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. శర్మిష్ట పనోలికి అంతర్జాతీయ స్థాయిలో కూడా మద్దతు లభించింది. నెదర్లాండ్స్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు గీట్ విల్డర్స్ ఆమె అరెస్టును “స్వేచ్ఛా భావ ప్రకటనకు ఆపద”గా అభివర్ణిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో, కోల్కతా హైకోర్టు శర్మిష్ట పనోలి పిటిషన్‌ను పరిశీలించి ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.
