కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని వైద్యసిబ్బంది, విద్యార్థులతో సహా పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి హద్దు దాటి వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా పోస్టు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
Also Read: Crime News: ఎన్‌సీసీ క్యాంప్ అంటూ.. 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి! మరో 12 మందికి వేధింపులు
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ ఘటన గురించి ‘కీర్తి సోషల్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి మూడు పోస్టులు అప్‌లోడ్ చేయబడ్డాయి. ఓ పోస్టులో ట్రైనీ డాక్టర్ చిత్రంను అప్‌లోడ్ చేశారు. మిగతా రెండు పోస్టులు సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్నాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను గుర్తుకు తెచ్చే విధంగా.. సీఎం మమతాను హత్య చేయడానికి ఇతరులను ప్రోత్సహించినట్లు పోస్టులు ఉన్నాయి. వీటిపై టీఎంసీ నేతలు ఫిర్యాదు చేయగా.. తల్తాలా పోలీసులు 12వ తరగతి విద్యార్థిని అరెస్ట్ చేశారు. విద్యార్థిని కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.
