KL Rahul in London due to Injury: ఇంగ్లండ్‌తో జరిగే ఐదవ టెస్టుకు కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే ఇందుకు కారణం. రాహుల్ సమస్య ఏమిటో బీసీసీఐ వైద్య బృందానికి అంతుచిక్కపోవడంతో అతడిని లండన్‌కు పంపింది. అక్కడి వైద్య నిపుణుల వద్ద రాహుల్ చికిత్స పొందనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాయంపై మార్చి 2 నాటికి బీసీసీఐకి ఓ క్లారిటీ రానుందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన టెస్టులో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. తొడకండరాలు పట్టేడయడంతో రెండు, మూడు, నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఇన్ని రోజులు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందాడు. ధర్మశాల వేదికగా జరుగనున్న ఐదవ మ్యాచ్‌లోనైనా రాహుల్ మైదానంలో దిగుతాడని భావించగా.. గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. రాహుల్ సమస్య ఏమిటో బీసీసీఐ వైద్య బృందానికి అంతుపట్టకపోవడంతో అతడిని లండన్‌కు పంపారు. అక్కడ స్కానింగ్ తీయనుండగా.. మరో రెండు రోజుల్లో అసలు సమస్య ఏంటో తెలియరానుంది.
Also Read: Kane Williamson: మూడోసారి తండ్రైన కేన్ మామ!
‘గత మూడు టెస్టులకు లోకేష్ రాహుల్ అందుబాటులో ఉంటాడనే అనుకున్నాం. అయితే తాను తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు రాహుల్ చెప్పాడు. ఇటీవల వికెట్ కీపింగ్ కారణంగా అతడిపై పనిభారం ఎక్కువైంది. రాహుల్ తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. అతడి తాజా మెడికల్ రిపోర్టును ఇంగ్లండ్‌లో గతంలో ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్‌కు పంపించారు. నేరుగా చెకప్ చేసిన తర్వాతే సమస్య ఏమిటో తెలుస్తుందని డాక్టర్ చెప్పారు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1తో గెలిచింది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఐదో టెస్టు ఆరంభం కానుంది.