Site icon NTV Telugu

KL Rahul: ఐపీఎల్ కెప్టెన్లపై కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్!

Kl Rahul

Kl Rahul

KL Rahul: క్రికెట్‌లోని అన్ని ఫార్మట్‌లు ఒక లెక్క ఐపీఎల్ ఒక లెక్క. అలాంటి ఐపీఎల్ గురించి, టోర్నీలోని టీంల కెప్టెన్స్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్ చేశారు. 2022-2024 మధ్య కేఎల్ రాహుల్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌‌కు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తొలి రెండు సీజన్లలో జట్టు ప్లే ఆఫ్స్‌నకు చేరగా, 2024లో ఏడో స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లో ఓ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓడిపోయిన తర్వాత కేఎల్‌ రాహుల్‌ వివరణ వినకుండా, ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా సీరియస్‌గా మాట్లాడిన వీడియోలు అప్పట్లో వైరలయ్యాయి. ఈ ఘటన తర్వాత రాహుల్ మెగా వేలంలో పాల్గొనగా దిల్లీ క్యాపిటల్స్ ఈ స్టార్ బ్యాటర్‌ను దక్కించుకుంది.

READ ALSO: Mythri Movie Makers : ప్రశాంత్ నీల్-మైత్రీ మూవీస్ కాంబోలో కొత్త మూవీ స్టార్ట్

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ టోర్నీ ఆడటంలో ఉన్న సవాళ్లను వివరించాడు. 10 నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటం కంటే, రెండు నెలలపాటు సాగే ఐపీఎల్‌ సీజన్‌ ముగింపునాటికి ఎక్కువ అలసిపోయానని తెలిపాడు. వాస్తవానికి ఐపీఎల్‌లో కెప్టెన్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ కెప్టెన్స్ అందరూ కూడా క్రీడేతర నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులకు జవాబుదారీగా ఉంటారని వెల్లడించాడు. నిర్ణయాల విషయంలో కెప్టెన్లకు నిరంతరం ఫ్రాంచైజీ యాజమాన్యాలు ప్రశ్నలు సంధిస్తుంటాయని అన్నారు.

‘ఐపీఎల్ సీజన్‌ ముగిసేనాటికి నేను 10 నెలల అంతర్జాతీయ క్రికెట్ ఆడటం కంటే మానసికంగా, శారీరకంగా చాలా కుంగిపోయానని గ్రహించాను. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి ఎన్నో సమావేశాలు, సమీక్షల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో నేను చాలా కష్టపడ్డాను. యాజమాన్య స్థాయిలో ఉన్నవారికి అనేక వివరణలు ఇవ్వాల్సి ఉంటుంది. కోచ్‌లు, కెప్టెన్‌లను నిరంతరం చాలా ప్రశ్నలు అడుగుతారు. ప్రత్యర్థి జట్టు 200 పరుగులు చేస్తే మనం కనీసం 120 రన్స్ ఎందుకు చేయలేదు? ఆ మార్పు ఎందుకు చేశారు? ఆ జట్టు బౌలర్లు ఎక్కువ స్పిన్‌ ఎలా వేయగలుగుతున్నారు?అతను తుదిజట్టులో ఎందుకు ఆడాడు? .. ఇలా చాలా ప్రశ్నలు అడుగుతారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న కోచ్‌లకు ఏం జరుగుతుందో తెలుసు. ఆట గురించి అవగాహన ఉన్న వారికి.. ఎందుకు విఫలమయ్యామని చెప్తే అర్థమవుతుంది. కొన్నిసార్లు అన్ని విభాగాల్లో రాణించినా.. మ్యాచ్‌లో విజయం సాధిస్తామన్న గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి.. క్రీడేతర నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులకు వివరించడం చాలా కష్టం’ అని కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కేఎల్ రాహుల్ కామెంట్స్‌కు ఆయన అభిమానుల నుంచి మద్దతు వస్తుంది.

READ ALSO: Anantnag Arrest NIA: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక అప్డేట్.. కారు బాంబు సప్లయర్ అరెస్టు!

Exit mobile version