KL Rahul Said The boys did really well in SA vs IND 1st ODI: తాము అనుకున్నదానికి పూర్తి భిన్నంగా మ్యాచ్ సాగిందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చిందని, కుర్రాళ్లతో విజయాన్నందుకోవడం గొప్పగా ఉందన్నాడు. దేశం కోసం ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఆడుతున్నారని, అంతర్జాతీయ క్రికెట్ అనుభవం పొందేందుకు కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం అని రాహుల్ పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ‘ఈ విజయం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. కుర్రాళ్లతో నిండిన జట్టుతో విజయం సాధించడం గొప్పగా ఉంది. మేము ఊహించిన దానికి పూర్తి భిన్నంగా మ్యాచ్ సాగింది. స్పిన్నర్లతో దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయాలని ప్లాన్ చేశాం. కానీ పేసర్లు అద్భుతంగా రాణించారు. క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. బంతి తిరిగింది. చాలా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ఒక ఫార్మాట్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతానికి టెస్ట్‌లు, టీ20లకే ఎక్కువ ఆదరణ ఉంది. దేశం కోసం ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఆడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం పొందేందుకు కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం’ అని అన్నాడు.
Also Read: PM Modi: మంచి మనసు చాటుకున్న ప్రధాని మోడీ.. కాన్వాయ్‌ను ఆపి..!
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 116 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(5/37), ఆవేశ్ ఖాన్ (4/27) సఫారీ పతనాన్ని శాసించారు. ఆండిలే ఫెలుక్వాయో (33) టాప్ స్కోరర్. ప్రొటీస్ నిర్ధేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (52; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్), సాయి సుదర్శన్ (55 నాటౌట్; 43 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలు బాదారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. మంగళవారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.