NTV Telugu Site icon

KL Rahul-LSG: కేఎల్ రాహుల్‌కు షాక్.. కొత్త కెప్టెన్‌ కోసం లక్నో అన్వేషణ!

Kl Rahul Captaincy

Kl Rahul Captaincy

KL Rahul LSG Captaincy: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబద్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌తో ఎల్‌ఎస్‌జీ ఫ్రాంచైజీ ఓనర్‌ సంజీవ్ గొయెంకా ఏదో కోపంగా మాట్లాడుతున్నట్లున్న వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. దీంతో రాహుల్‌ ఎల్‌ఎస్‌జీని వీడి వేరే ఫ్రాంఛైజీకి వెళ్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం కోల్‌కతాలో ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకాను రాహుల్ కలిశాడు. లక్నో కెప్టెన్ తనను రిటైన్‌ చేసుకోవాలని కోరినట్లు తెలిసింది. అయితే రాహుల్‌ను గ్యారంటీగా రిటైన్‌ చేసుకుంటామని చెప్పలేమని ఎల్‌ఎస్‌జీ ఫ్రాంఛైజీ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి.

‘కోల్‌కతాకు వచ్చి ఆర్‌పీజీ ప్రధాన కార్యాలయంలో సంజీవ్ గోయెంకాను కేఎల్ రాహుల్ కలిశారు. ఎల్‌ఎస్‌జీనే తాను ఉంటానని గోయెంకాతో చెప్పారు. బీసీసీఐ రిటెన్షన్ పాలసీని ప్రకటించిన తర్వాతే ఎల్‌ఎస్‌జీ తమ ప్రణాళికలను రూపొందిస్తుంది. లక్నో తనను రిటైన్‌ చేసుకోవాలని రాహుల్ కోరుకుంటున్నాడు కానీ.. ఫ్రాంఛైజీలు ఎంత ఖర్చు పెట్టాలనేది తెలిసిన తర్వాతే ఎంతమందిని రిటైన్‌ చేసుకోవాలనేది లక్నో మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే ఎల్‌ఎస్‌జీ ఎవరికీ మాట ఇవ్వలేదు’ అని లక్నో ఫ్రాంఛైజీ వర్గాలు తెలిపాయి.

Also Read: Gold Rate Today: స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్.. నేడు తులం ఎంతుందంటే?

‘ఒకవేళ లోకేష్ రాహుల్‌ను ఎల్‌ఎస్‌జీ రిటైన్‌ చేసుకున్నా.. కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం మాత్రం లేదు. బ్యాటర్‌గా తన సేవలు అందించాలని రాహుల్ కోరుకుంటున్నాడు. లక్నో కొత్త కెప్టెన్‌ కోసం అన్వేషిస్తోంది. నికోలస్ పూరన్‌, కృనాల్ పాండ్యా సహా మరికొందరు కెప్టెన్సీ రేసులో ఉన్నారు. కెప్టెన్సీపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు’ అని లక్నో ఫ్రాంఛైజీ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఏదేమైనా రాహుల్‌కు షాక్ తగిలేలా తప్పేలా లేదు. లక్నో ఫ్రాంఛైజీ వర్గాల మాటలను బట్టి చూస్తే కెప్టెన్సీ పోవడం మాత్రం పక్కా అని అర్ధమవుతోంది. గత మూడేళ్లుగా లక్నోతోనే రాహుల్ ఉంటుంన్న విషయం తెలిసిందే.