SRH Register Lowest Score in IPL Finals: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ ఫైనల్‌లో అత్యంత తక్కువ స్కోర్ చేసిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 113 పరుగులకే ఆలౌట్ అయి ఈ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇంతకుముందు ఈ రికార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2013 ఫైనల్‌లో చెన్నై 125/9 స్కోర్ చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది. ఐపీఎల్ 2017 ఫైనల్‌లో ముంబై 129/8 చేసింది. 2017 ఫైనల్‌లోనే రైజింగ్ పూణే సూపర్ జెయింట్ 128/6 రన్స్ చేసి.. ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటి వరకు ఐపీఎల్ ఫైనల్‌లో ఇవే అత్యల్ప స్కోర్లు. ఇప్పుడు ఈ జాబితాలో ఎస్‌ఆర్‌హెచ్ చేరింది. ఈ సీజన్‌లో 287/3, 277/3 స్కోర్లతో టీ20 చరిత్రలోనే భారీ స్కోర్లు నమోదు చేసిన సన్‌రైజర్స్.. ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమైంది.
Also Read: Kavya Maran: కెమెరా కంట పడకుండా.. వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్న కావ్య మారన్!
ఐపీఎల్ 2024 ఫైనల్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ (2/14), హర్షిత్ రాణా (2/24), ఆండ్రి రసెల్ (3/19)ల దెబ్బకు ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. 24 పరుగులు చేసిన కెప్టెన్ ప్యాట్ కమిన్సే టాప్ స్కోరర్. లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ (52 నాటౌట్; 26 బంతుల్లో 4×4, 3×6), రహ్మనుల్లా గుర్బాజ్ (39; 32 బంతుల్లో 5×4, 2×6) చెలరేగారు.