Mitchell Starc will be KKR X-Factor in IPL 2024 Said Gautam Gambhir: ఐపీఎల్ 2024 మినీ వేలంలో రూ.24.75 కోట్లకు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీలోనే ఇదే అత్యధిక ధర. ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన స్టార్క్.. 17వ సీజన్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. మార్చి 22న టోర్నీ ఆరంభం అవుతుండగా.. మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ సిద్ధమవుతోంది. ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన స్టార్క్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడు ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పలువురు ఆటగాళ్లతో కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ కోల్‌కతాలో అడుగు పెట్టాడు. జట్టుతో పాటు ప్రాక్టీస్ సెషన్‌లో అతడు పాల్గొననున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతీ.. మిచెల్ స్టార్క్ ధరపై స్పందించాడు. ‘మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా జట్టుకు ఎలాంటి సేవలు అందించాడో మనం చూశాం. కేకేఆర్ తరఫునా మంచి ప్రదర్శన చేస్తాడని భావిస్తున్నా. ఈ సీజన్‌లో అతడు మాకు కీలక ఆటగాడు అవుతాడు. అత్యంత విలువైన క్రికెటర్ అనే ట్యాగ్ స్టార్క్‌ని ఒత్తిడికి గురి చేయలేదు. అతడు తన ఆట తాను ఆడుకుంటూ పోతాడు’ అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
‘కోల్‌కతా మెంటార్‌గా మళ్లీ రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే కేకేఆర్‌ను నేను ఓ ఫ్రాంచైజీగా చూడను. జట్టుతో నాకు మంచి అనుబంధం ఉంది. తప్పకుండా అభిమానులకు కేకేఆర్ మీద భారీ అంచనాలే ఉంటాయి. వారిని సంతోషపెట్టేందుకు మేం ప్రయత్నిస్తాం. గత సీజన్లలో మేం పెద్దగా రాణించలేకపోయాం. ఈసారి మాత్రం దాన్ని పునరావృతం కానివ్వం. టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతాం’ అని కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. మిచెల్ స్టార్క్ రెండు ఐపీఎల్ సీజన్లలో మాత్రమే ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అతడు చివరిసారిగా 2018లో ఆడాడు. అప్పుడు రూ.9.4 కోట్లకు స్టార్క్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది.