Kishan Reddy: తెలంగాణలో ఆర్భాటంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగి పోవడం తీవ్రమయిన అంశమని ఆయన అన్నారు. క్వాలిటీ విషయంలో అనుమానాలు మొదలయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదని, కేసీఆర్ సూపర్ ఇంజనీర్‌గా అవతారం ఎత్తారన్నారు. మేడిగడ్డ లోపాలతో ప్రాజెక్ట్ పైనే ఎన్నో అనుమానాలు మొదలయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని ఆయన ఆరోపించారు. నాసిరకంగా నిర్మించారన్న ఆయన.. కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్‌గా మారిందన్నారు. అప్పు చేసిన ప్రాజెక్ట్ ఇలా మారిందని.. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు.
Also Read: Komatireddy Rajagopal Reddy: కేసీఆర్‌ను ఓడించే శక్తి బీజేపీకి ఉందనుకున్నా.. కానీ..
ఇది నేరమన్న కిషన్ రెడ్డి.. పిల్లర్లు కృంగి పోతే జనం చూసి అధికారులకు చెప్పారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి శాసన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ ఇచ్చారని.. ప్రాజెక్ట్ అనుకున్న లక్ష్యాలకు చేరుకోలేదన్నారు. నాలుగేళ్లలో 154 టీఎంసీల నీళ్ళు మాత్రమే లిఫ్ట్ చేశారన్నారు. ప్రాజెక్టులను టూరిజం సెంటర్లుగా చూపెట్టారని.. అదనపు ఇరిగేషన్‌కు ఎక్కడా వాడుకోలేదన్నారు. రైతులకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడలేదని ఆరోపించారు. 18లక్షల ఎకరాల టార్గెట్ సాగు అన్నారని.. ప్రజలను మోసం చెయ్యడానికి ఈ ప్రాజెక్ట్‌ను ఉపయోగించారని విమర్శలు గుప్పించారు. అప్పులతో పనికిరాని, చెత్త ప్రాజెక్ట్‌ను కట్టించారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద బ్లండర్ అని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పిచ్చి తుగ్లక్ డిజైన్ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పిల్లర్లు కుంగి పోతే, కుట్ర కేసు నమోదు చేశారని.. ఇది దారుణమన్నారు.
Also Read: Alai Balai: అట్టహాసంగా అలయ్-బలయ్ కార్యక్రమం.. హాజరైన ప్రముఖులు
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “న్యాయ విచారణకు కేసీఆర్ సిద్దమా. ముఖ్యమంత్రి మీదే కేసు పెట్టాలి. కాళేశ్వరం విషయంలో ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్ కుటుంబం నోరు మెదపడం లేదు. కేంద్ర నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంది. అధికారులు సరిగ్గా వివరాలు ఇవ్వడం లేదు. డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. ప్రజాధనాన్ని వృథా కాకుండా డ్యాం సేఫ్టీ టీమ్ ప్రయత్నం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. దీనంతటికీ కారణం కేసీఆర్ అతి తెలివి. కుట్ర జరిగిందని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. చేసింది తప్పని కేసీఆర్ తెలుసుకొని సీఎం రాజీనామా చెయ్యాలి.” అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.