కన్నడ సినీ పరిశ్రమలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడిగా పరిచయం కానున్న కీర్తన్ నాద గౌడ దంపతులు తమ నాలుగున్నరేళ్ల కుమారుడు సోనార్ష్ కె. నాదగౌడను కోల్పోయారు. డిసెంబర్ 15వ తేదీ సోమవారం రోజున జరిగిన ఓ హృదయ ప్రమాదంలో, చిన్నారి సోనార్ష్ అనుకోకుండా లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. కీర్తన్ నాదగౌడ కుటుంబం ఈ తీవ్ర శోకంలో మునిగిపోగా, సినీ వర్గాలు ఈ చిన్నారి అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కీర్తన్ నాదగౌడ దంపతులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Also Read : Upasana : మెగా ఫ్యాన్స్‌కు .. ఉపాసన నుంచి డబుల్ గుడ్ న్యూస్
కీర్తన్ నాదగౌడ కన్నడలో అనేక చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసి, పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అయిన ‘కేజీఎఫ్’ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఒక హారర్ చిత్రంతో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సంతోషకరమైన సమయంలో ఈ విషాదం జరగడం ఆయన దంపతులకు తీరని లోటుగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు. పుత్రశోకం నుంచి తేరుకునే మనోధైర్యాన్ని దంపతులకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆ భగవంతుని వేడుకున్నారు.
