Site icon NTV Telugu

Kinetic E-Luna: కొత్తగా రాబోతున్న కైనెటిక్ ఈ-లూనా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కీ.మీ.!

Kinetic E Luna

Kinetic E Luna

Kinetic E-Luna: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం రోజురోజుకీ పెరుగుతోంది. దీనితో ప్రతి ఆటోమొబైల్ సంస్థలు వినియోగదారుల అవసరాల మేరకు కొత్త మోడల్స్ ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ కైనెటిక్ త్వరలోనే అప్డేటెడ్ వెర్షన్ కైనెటిక్ ఈ-లూనాను మార్కెట్‌లో తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మోపెడ్ కోసం కంపెనీ ప్రత్యేకమైన డిజైన్‌కు పేటెంట్ ను కూడా పొందింది. కైనెటిక్ లూనా ఇదివరకు భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మోపెడ్లలో ఒకటి. ముఖ్యంగా లాజిస్టిక్స్ కంపెనీలు అలాగే చిన్న వ్యాపారుల అవసరాలను తీర్చే వాహనంగా ఇది విశేషమైన గుర్తింపు దీని సొంతం. అయితే, త్వరలో విడుదల రాబోతున్న కైనెటిక్ ఈ-లూనా పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్‌గా అందుబాటులో ఉండనుంది.

Read Also: MI vs KKR: సొంత ఇలాకాలోనైనా ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తారా?

రాబోయే కొత్త కైనెటిక్ ఈ-లూనా గత వెర్షన్ తరహా డిజైన్ ను కొనసాగిస్తూనే, కొన్ని మార్పులను చేపట్టింది. ఇందులో హెడ్‌లైట్ చతురస్ర ఆకారంలో డిజైన్ రానుంది. ఇక డాష్‌బోర్డ్ లో ఒక చిన్న ట్యాబ్ ఆకృతిలో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉండనుంది. ఇక బ్యాటరీ ప్యాక్ విషయంలో మాత్రం ఖచ్చితమైన సమాచారం ఇంకా వెల్లడించనప్పటికీ.. రైడర్ సీట్, హ్యాండిల్‌బార్ మధ్య పెద్ద బాక్స్ కనిపిస్తోంది. కాబట్టి ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్ కోసం డిజైన్ చేసినట్లుగా అనిపిస్తోంది. కాబట్టి ఈ కొత్త బ్యాటరీ టెక్నాలజీ వలన మెరుగైన మైలేజ్ అందించే అవకాశం ఉంది. అయితే ఈ విషయాలపై ఇప్పటి వరకు కైనెటిక్ కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, కొత్త మోడల్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ICE లూనా తరహాలోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇకపోతే, ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కైనెటిక్ ఈ-లూనా 2KW బ్యాటరీ ద్వారా ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 110 కి.మీ వరకు ప్రయాణించగలదు. అయితే, ఈ కొత్త మోడల్‌లో అదనపు బ్యాటరీ ప్యాక్ అందించే అవకాశం ఉంది. ఇక ఈ నూతన వెర్షన్‌లో పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 200 కి.మీ వరకు రైడింగ్ రేంజ్ పొందే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఉన్న ఈ మోడల్ గరిష్టంగా 50 km/h వేగంతో ప్రయాణించగలదు. బ్యాటరీ పూర్తి ఛార్జ్ కావడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. కైనెటిక్ కంపెనీ ఇంకా అధికారిక లాంచ్ తేదీ ప్రకటించలేదు. అయితే, ఈ-లూనాను 2025 పండుగ సీజన్‌లో భారత మార్కెట్‌లో విడుదల చేసే అవకాశముంది. లాంచ్ సమయం దగ్గర పడే కొద్దీ మోడల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version