ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో సవరణలపై కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రతను బలహీనపరిచే కుట్ర అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఈ దుస్సాహసం, పక్కా ప్రణాళికతో ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎన్నికల సంఘం చిత్తశుద్ధిని దెబ్బతీయడం రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని విమర్శించారు. వాటిని పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఖర్గే అన్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు..
ఎన్నికల కమిషనర్లను నియమించే సెలక్షన్ ప్యానెల్ నుంచి గతంలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించారని, ఇప్పుడు హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎన్నికల సమాచారాన్ని దాచిపెడుతున్నారని ఆయన అన్నారు. ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపు, ఈవీఎంలలో పారదర్శకత లోపించడం వంటి ఎన్నికల అక్రమాల గురించి కాంగ్రెస్ పార్టీ రాసినప్పుడల్లా ఎన్నికల సంఘం అవమానకర రీతిలో స్పందించిందన్నారు. కొన్ని తీవ్రమైన ఫిర్యాదులను కూడా స్వీకరించలేదని ఖర్గే ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి, పాక్షిక న్యాయవ్యవస్థ అయినప్పటికీ స్వతంత్రంగా ప్రవర్తించడం లేదని ఇది మరోసారి రుజువు చేస్తోందన్నారు.
జైరాం రమేష్ ప్రకటన..
పంజాబ్, హర్యానా హైకోర్టు ఎన్నికల కమిషన్‌కు ఇటీవల జారీ చేసిన సూచనల మేరకు ఈ చర్యను హడావుడిగా తీసుకున్నట్లు చెబుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలను అందుబాటులో ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సవరణను చట్టపరంగా సవాలు చేస్తామని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అసలేం జరిగింది..
ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు ‘ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961’లోని రూల్ 93లో కేంద్ర న్యాయ శాఖ శుక్రవారం సవరణ చేసింది. దీని ప్రకారం కొన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, వీడియోలను ప్రజలందరూ చూసేలా బహిరంగపర్చడానికి అవకాశం ఉండదు. ఆంక్షలు అమలవుతాయి. కాండక్డ్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్–1961లోని రూల్ 93(2)(ఎ) ప్రకారం.. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను బహిరంగపర్చాల్సిందే. ప్రజలంతా వాటిని చూడొచ్చు. తనిఖీ చేసుకోవచ్చు. కొత్తగా చేసిన సవరణ ప్రకారం.. ఎన్నికలకు సంబంధించి కొన్ని రకాల పత్రాలను మాత్రమే బహిరంగపర్చవచ్చు. ఎల్రక్టానిక్ డాక్యుమెంట్లు బహిర్గతం చేయడం నేరమవుతుంది.