NTV Telugu Site icon

Star Hospital : ‘డయాబిటిస్’ గురించిన ఈ విషయాలు మీకు తెలుసా ?

Diabetes

Diabetes

Star Hospital :
ప్ర. ‘డయాబిటిస్’ అంటే ఏమిటి? అది ఉందని నేను తెలుసుకోగల పరీక్షలు ఏమిటి?
జ. ‘డయాబిటిస్’ను తెలుగులో ‘మధుమేహం’ అంటారు. మీ రక్తంలో గనుక, చక్కెరస్థాయులు (బ్లడ్ గ్లూకోజ్ లేదా బ్లడ్ షుగర్ లెవల్స్) అధికంగా ఉన్నట్లయితే, ‘దయాబిటిస్’ ఉన్నట్లు అర్థం. గ్లూకోజ్ అనేది మీ శరీరానికి శక్తిని ఇచ్చే ప్రధానవనరు. ఈ గ్లూకోజ్ ను మీ శరీరం సొంతంగా ఉత్పత్తి చేసుకోగలుగుంది, అదనంగా మీ ఆహారంనుంచికూడా శరీరానికి గ్లూకోజ్ అందుతుంది.

ఈ గ్లూకోజ్ శక్తి మీ శరీరంలోని ప్రతి కణానికీ చేరడానికి సహాయపడే ఒక హార్మోన్- ‘ఇన్సులిన్’. ఈ హార్మోను మీ శరీరంలో ఉండే ‘పాంక్రియాస్’ గ్రంధి తయారుచేస్తుంది. మీ శరీరంలో ‘డయాబిటిస్’ గనుక ఉన్నట్లయితే, మీ శరీరం తగినంత ‘ఇన్సులిన్’ను తయారు చేసుకోలేకపోవచ్చు లేదా, కొంత మాత్రమే తయారు చేయవచ్చు. లేదా, ఏదో కొంత ఉత్పత్తి అవుతున్న ‘ఇన్సులిన్’ను కూడా తగినవిధంగా శరీరకణాలకు అందలేని స్థితి ఉండవచ్చు. ఫలితంగా ఈ గ్లూకోజ్ మీ రక్తంలోనే ఉండిపోయి, కణాలకు చేరని పరిస్థితి ఏర్పడుతుంది.

మీ రక్తంలో ‘బ్లడ్ షుగర్’ స్థాయి ఎంతలో ఉంది అని గుర్తించడానికి చిన్నపాటి రక్త పరీక్షలు సరిపోతాయి. వీటిలో – ‘ఫాస్టింగ్ బ్లడ్ షుగర్’ (ఉదయం వేళల్లో ఏ ద్రవమూ, ఏ ఆహారమూ తీసుకోకమునుపు చేసే పరీక్ష), ‘ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్’ (గ్లూకోజ్ను సహించగల పరిస్థితి ఏమిటో గుర్తించే నోటిద్వారా గుర్తించే పరీక్ష), ‘హెచ్ఐవి 1సి’ (గత మూడునెలల కాలంలో రక్తంలో గ్లూకోజ్ నిల్వల స్థితిని అంచనా వేసే రక్తపరీక్ష) వంటి వాటిద్వారా రక్తంలో గ్లూకోజ్ నిల్వల స్థాయిని గుర్తించవచ్చు.

ప్ర. ‘డయాబిటిస్’ అనేది ఎవరికి రాగల ప్రమాదం (రిస్క్) ఉంది?

జ. ‘డయాబిటిస్’ రాగల రిస్క్ ఈ దిగువవారికి అధికం…

1. కుటుంబంలో ‘డయాబిటిస్’ ఉన్న చరిత్ర ఉన్నవారికి

2. స్థూలకాయం (ఓబెసిటీ)

3. శారీరక వ్యాయామం లేనివారికి

4. అనారోగ్యకారకం కాగల ఆహారపుటలవాట్లు

5. ‘డయాబిటిస్’కు ముందు ప్రమాద సూచికల చరిత్ర (ప్రి-డయాబిటిస్ హిస్టరీ)

6. పిసిఓడి (పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) లేదా అండాశయంలో కణితి ఉన్న చరిత్ర గలవారికి

7. గర్భం ధరించిన సమయంలో మహిళలలో కానవచ్చే ‘గెస్టేషనల్ డయాబిటిస్’ వంటిది ఉన్న వారికి

8. అధిక రక్తపోటు (హై-బ్లడ్ ప్రెషర్) ఉన్నవారికి

9. రక్తంలో అధిక కొవ్వు నిల్వలు (హై-కొలెస్టరాల్) ఉన్నవారికి

10. పొగ తాగే అలవాటు ఉన్నవారికి – ‘డయాబిటిస్’ రాగల ప్రమాదం ఉంది.

ప్ర. ‘డయాబిటిస్’ లక్షణాలు ఎలా ఉంటాయి?

జ. దాహం అధికంగా ఉండటం, తరచుగా మూతవిసర్జన చేయవలసి రావటం, ఆకారణమనిపించే విధంగా శారీరక బరువు తగ్గటం, అలసట, కంటిచూపు మసకబారటం, ఒంటిమీది గాయాలు త్వరితంగా తగ్గకపోవటం వంటివన్నీ సాధారణ ‘డయాబిటిస్’ లక్షణాలుగా చెప్పవచ్చు.

ప్ర. ఇటీవలి కాలంలో ‘డయాబిటిస్’ ఎందుకు పెరుగుతోంది?

జ. 2023 జూన్ నెల ‘లాన్సెట్’ అనే శాస్త్రీయ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం- మనదేశంలో జనాభాలో దాదాపు 11 శాతంమంది ‘దయాబిటిస్’ ఉందనీ, 15 శాతం జనాభాలో ‘ప్రి-డయాబిటిస్’ స్థితి ఉందనీ అంచనాలు ఉన్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి. ‘దయాబిటిస్’- ఇలా పెరిగిపోవటానికి బహుశా చాలా కారణాలు ఉండొచ్చు. అధికమవుతున్న నగరీకరణ, మన జీవితంలో పెరుగుతున్న ఆధునిక పాశ్చాత్య పోకడలు, ఇతర పనులవల్ల ఇంటిలో వంట చేసుకోగల సమయం ఉండకపోవటం, బయటకు వెళ్లి తినటానికి మరిన్ని సదుపాయాలు, అనేకంగా రెస్టారెంట్లు మనచుట్టూ ఉండటం, ఏ వేళలో అయినా, కాలు కదపకుండా ఇంటికే ఆహారం తెప్పించుకోగల వసతులు ఉండటం, ప్రాసెస్ట్ ఫుడ్స్ అధికం కావటం, కదలనబుర్లేని ఉద్యోగ బాధ్యతలు, వివిధ కారణాల వల్ల జీవితంలో పెరుగుతున్న ఒత్తిళ్లు- ఇవన్నీ ‘దయాబిటిస్’ ప్రమాదాన్ని పెంచుతున్నాయి.

ప్ర. ‘దయాబిటిస్’కు చికిత్స చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి?

జ.. ‘డయాబిటిస్’ను అదుపులో ఉంచుకోకపోయినా, సరిగ్గా పట్టించుకోకపోయినా, అనేక ఆరోగ్యసమస్యలు ఎదురు కావచ్చు. ఈ సమస్యలలో కొన్ని ఇవి :

1. గుండె సంబంధిత సమస్యలు (‘కార్డియో-వాస్యులర్ ఇష్యూస్’): ‘డయాబిటిస్ ‘వల్ల పలురకాల గుండెజబ్బులు, పక్షవాతం రాగల ప్రమాదం అధికమవుతుంది.

2 మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధులు (‘నెఫ్రోపతి’): రక్తంలో గనుక అధికంగా చక్కెరలు (హై-బ్లడ్ షుగర్ లెవల్స్) నిలువ ఉన్నట్లయితే, కాలక్రమంలో మూత్రపిండాలకు నష్టం జరిగి, మూత్రపిండాల వ్యాధులు రావచ్చు.

3. కంటి సమస్యలు (‘రెటినోపతి’): ‘డయాబిటిస్’వల్ల కంటిచూపునకు ఇబ్బందులు తలెత్తి, అంధత్వమూ సంభవించవచ్చు.

4. నరాలకు నష్టం (‘న్యూరోపతి’): ‘డయాబిటిస్’వల్ల నరాలు దెబ్బ తిని, తిమ్మిర్లు రావటం, నొప్పి, మరీ తీవ్రమైన స్థితిలో పూర్తిగా స్పర్శ కోల్పోవటం వంటి సమస్యలు కనిపించవచ్చు.

5. పాదాల సమస్యలు (‘ఫుట్ ప్రాబ్లమ్స్’): ‘డయాబిటిస్’ ఉన్నవారికి పాదాలలో ఇన్ఫెక్షన్స్, అల్సర్లు వంటివి రాగల ప్రమాదం ఉంది.

6. చర్మసంబంధిత సమస్యలు (‘స్కిన్ ప్రాబ్లమ్స్’): ‘డయాబిటిస్’కు గురయిన వారికి చర్మసంబంధితమైన -బాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి అనేక సమస్యలు ఎదురుకావచ్చు.

7. చిగుళ్ల వ్యాధి (‘గమ్ డిసీజెస్’): ‘డయాబిటిస్’ ఉంటే, నోటిచిగుళ్లకు సంబంధించిన వ్యాధుల ప్రమాదమూ అధికంగా ఉంటుంది.

8. గర్భసమయంలో సమస్యలు: గర్భల ధరించినప్పుడు రాగల గెస్టేషనల్ డయాబిటిస్’ వల్ల- గర్భం ధరించిన కాలంలో, ప్రసవసమయంలో పలు సమస్యలు ఎదురుకావచ్చు.

9. మానసిక అనారోగ్య సమస్యలు: మానసికమైన కుంగుబాటు, ఆందోళన లేదా ఆదుర్దా వంటి అనారోగ్య సమస్యలు – ‘దయాబిటిస్’వల్ల సంభవించవచ్చు.

ప్ర. ‘డయాబిటిస్’కు చికిత్స ఏమిటి?

జ. ‘దయాబిటిస్’ అనేది పెద్ద పజిల్ వంటిది. ఈ పజిల్ను పరిష్కరించడానికి మనం అనేకవిధాలుగా, పలుమార్గాల ద్వారా ప్రయత్నించాల్సిఉంటుంది. ఈ విధానాలలో ముఖ్యమైనవి :

1. ఆహారంలో మార్పులు

2. తగిన శారీరకబరువును మాత్రమే కలిగిఉండటానికి నిత్య శారీరక వ్యాయామాలు

3. నోటిద్వారా మందులు తీసుకోవటం

4. ఇన్సులిన్ థెరపీ (ఇస్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం)

5. రక్తంలో చక్కెరనిల్వల స్థాయిని నియంత్రణలో ఉంచుకోవటం

6. క్రమబద్ధమైన వైద్య పరీక్షలు చేయించుకోవటం,

అయితే, ఇప్పుడు ‘దయాబిటిస్’కు చికిత్స అనేది బ్లడ్ షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుకోవటంతో ఆగిపోవటం లేదు. ఇప్పుడు డాక్టర్లయిన మేము-‘డయాబిటిస్’ వల్ల వ్యాధిగ్రస్థులలో తలెత్తే పలు సమస్యలను తగ్గించటం, వారి శరీరంలోని అనేక అవయవాల నష్టం జరగకుండా కాపాడే ప్రయత్నాలు చేయటం వంటివాటిపై దృష్టిని నిలుపుతున్నాము. వ్యాధిగ్రస్తులలో గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులవంటివి తగ్గించటం, శారీరక బరువును అదుపులో ఉంచటం, వారి ప్రాణనష్టం కాకుండా చూడగలుగుతున్నాం. వారానికి ఒక్కసారి వేయించుకోగల, ఇన్సులిన్ కాని ఇంజెక్షన్లూ ఇప్పుడు లభిస్తున్నాయి. సరైన మోతాదులో వాడినట్లయితే, మరింత అధికకాలం పనిచేస్తూ, ‘హైపో గ్లైసిమియా’- అంటే హటాత్తుగా రక్తంలో చక్కెననిల్వలు బాగా పడిపోవటం వల్ల కలిగే సమస్యలను తగ్గించగల కొత్తరకం ఇన్సులిన్లూ ఇప్పుడు దొరుకుతున్నాయి.

వ్యాధిగ్రస్థులలో నిరంతరంగా రక్తంలో చక్కెరనిల్వల స్థాయిని గుర్తించే ‘కంటిన్యువస్ గ్లూకోజ్ మానిటర్స్’ (సిజిఎమ్స్’) అనే కొత్త పరికరాలు లభ్యమవటం అదృష్టమే అనుకోవచ్చు. ఇలాంటి పరికరాలు ప్రతీ కొన్ని నిమిషాలకూ రోగి బ్లడ్ షుగర్ లెవల్స్న గుర్తిస్తూ, వివిధ రకాల ఆహారాలవల్ల ఏయే ప్రభావాలు కనిపిస్తున్నాయో గుర్తించగల అవకాశం అందిస్తున్నాయి. స్మార్ట్ వాచ్లలో, స్మార్ట్ ఫోన్లలో ఇప్పుడు ఉంటున్న పలురకాల అప్లికేషన్స్ (‘యాప్స్’)వల్ల కూడా రోగులు, తమ బ్లడ్ షుగర్ లెవల్స్న సరిచూసుకోవచ్చు. అలాగే, కొన్ని యాప్స్ అయితే, రోగులకు వారు తీసుకుంటున్న ఆహారంగురించి పూర్తి వివరాలు అందిస్తూ, వారు తమ జీవనవిధానాలను సరిగ్గా మార్చుకునేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తూ, ఆరోగ్యపరిరక్షణలో తోడ్పడుతున్నాయి.

ప్ర. మా తల్లిదండ్రులు ఇద్దరికీ ‘డయాబిటిస్’ ఉంది. నాక్కూడా ‘డయాబిటిస్’ వస్తుందా?

జ. ‘డయాబిటిస్’లో ఉన్న ‘టైప్ 2 డయాబిటిస్’ అనే రకం వారసత్వ వాతావరణ కారణాల సంజనితంగా వస్తుంది. కనుక, చర్చని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని తీసుకోవటం, వ్యాయామం చేయటం, బరువు తగ్గించుకోవటం వంటి జాగ్రత్తల వల్ల ‘టైప్ 2 డయాబిటిస్’ రాకుండా నిరోధించుకోగల అవకాశం ఉంది.

ప్ర. ఒత్తిడి (స్ట్రెస్’) వల్ల ‘డయాబిటిస్’పై ప్రభావం ఉంటుందా?

జ. ఒత్తిడివల్ల ‘డయాబిటిస్’పై ప్రభావం తప్పక ఉంటుంది. మీరు గనుక ఒత్తిడిలో ఉంటే, ఆ సమయంలో శరీరం విడుదలచేసే ‘కార్టిసాల్’, ‘ఎడ్రినలిన్’ వంటి హార్మోనులు, బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగటానికి కారణం అవుతాయి. ఒత్తిడిని తట్టుకోవడానికి కొందరు – కొంత అనారోగ్యమైన ఆహారం తినటం, అంత చురుకుగా ఉండకపోవటం, మందులు సరిగ్గా తీసుకోకపోవటం వంటివాటిని చేస్తారు. వీటి కారణంగా బ్లడ్ షుగర్ లెవల్స్ మార్పులు ఉంటాయి. ప్రాణాయామం, యోగ, ధ్యానం చేయటం, క్రమపద్ధతిలో వ్యాయామం చేయటం, పనులు చేయటం వంటి వాటివల్ల ఒత్తిడి లేదా ‘స్ట్రెస్ ‘ ను తగ్గించుకోవచ్చు.

అయితే, అన్ని సమయాల్లోనూ మీ వైద్యుల సూచనలను అనుసరించడం అనేది ప్రధానమని గుర్తించండి.

డా. రోహిణి కస్తూరి
ఎండోక్రినాలజిస్ట్,
స్టార్ హాస్పిటల్స్
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్.
Contact : 07969250 191