Kevin Pietersen Trolls Prithvi Shaw over Fitness Issues: ఫిట్‌నెస్, పేలవ ఫామ్ కారణంగా యువ బ్యాటర్ పృథ్వీ షా భారత జట్టులో స్థానం కోల్పోయి చాలా కాలమే అయింది. కెరీర్ ఆరంభంలో అద్భుతమైన ఆట తీరుతో ఔరా అనిపించిన అతడు క్రమంగా ముంబై జట్టులో కూడా చోటు కోల్పోయాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతడిని కొనేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదంటే పృథ్వీ షా పరిస్థితి మనం అర్ధం చేసుకోవచ్చు. ఫిట్‌నెస్ కోల్పోయి బాగా బరువెక్కిన షాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అసహనం వ్యక్తం చేశాడు. భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎలా స్లిమ్‌గా మారాడో షాకు కాస్త చూపించండయ్యా అని కోరాడు.
బొద్దుగా ఉండడంతో సర్ఫరాజ్ ఖాన్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. భారత జట్టులో చోటు సంపాదించడం కోసం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. రెండు నెలల్లోనే ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు. ఇప్పుడు సర్ఫరాజ్ స్లిమ్‌గా కనబడుతున్నాడు. సన్నబడిన సర్ఫరాజ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోస్ కాస్తా కెవిన్ పీటర్సన్ కంటపడ్డాయి. సర్ఫరాజ్‌పై ప్రశంసలు కురిపిస్తూనే.. పృథ్వీ షాకు చురకలు అంటించాడు. సర్ఫరాజ్ ఎలా స్లిమ్‌గా మారాడో.. పృథ్వీ షాకు చెప్పండి అని పేర్కొన్నాడు. పృథ్వీ కూడా సర్ఫరాజ్ మాదిరిలా మారొచ్చు కదా అని సూచించాడు.
Also Read: Tiger Attack: యువకుడిపై పెద్దపులి దాడి.. గట్టిగా కేకలు వేయడంతో.. !
‘సర్ఫరాజ్ ఖాన్ సూపర్. మంచి ప్రయత్నం. నీకు అభినందనలు తెలుపుతున్నా. ఇప్పుడు చాలా స్లిమ్‌గా ఉన్నావు. మైదానంలో మంచి ప్రదర్శనకు ఇది తప్పకుండా దోహదపడుతుందని ఆశిస్తున్నా. జాతీయ జట్టుకు ఆడాలనే సంకల్పంతో కష్టపడుతున్న తీరు అద్భుతం. సర్ఫరాజ్ స్లిమ్‌గా మారిన విషయాన్ని పృథ్వీ షాకు చెప్పండి. పృథ్వీ కూడా సర్ఫరాజ్ మాదిరి స్లిమ్‌గా మారొచ్చు. పృథ్వీ ఓసారి ఆలోచించు. దృఢమైన శరీరంలో దృఢమైన మనసు ఉంటుంది’ అని ఎక్స్‌లో కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు. ఇందుకు సర్ఫరాజ్ పోటోలను జత చేశాడు. పీటర్సన్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
