Kerala Black Magic Case: కేరళలో సంచలనం సృష్టించిన ఇద్దరు మహిళల నరబలి కేసులో ముగ్గురు నిందితులకు స్థానిక న్యాయస్థానం 12 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో విచారణ చేపట్టగా.. వెన్నులో వణుకు పుట్టించే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. నిందితులను ప్రేరేపించడం నుంచి మహిళలను తీసుకొచ్చి నరబలి ఇచ్చిన ప్రతీ విషయంలో మహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నరబలి వెనుక మరేదైనా ఉద్దేశం ఉందా? ఇంకా ఎక్కువ మంది బాధితులు ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అంతే కాకుండా స్థానికంగా 12 మంది మహిళల మిస్సింగ్ కేసుకు.. వీరికి ఏమైనా సంబంధం అనే కోణంలో విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడైన మాంత్రికుడు రషీద్ తర్వాత టార్గెట్ లైలా భర్త భగవల్ సింగ్ అయ్యుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భగవల్‌సింగ్‌ను అంతమొందించి లైలాతో కలిసి జీవించేందుకు మాంత్రికుడు పన్నాగం పన్ని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
కేరళలోని పథనంతిట్ట జిల్లా తిరువల్లకు చెందిన నిందితులు భగవల్ సింగ్, అతని భార్య లైలాలు డబ్బు ఆశకోసం ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. వీరిద్దరికి రషీద్ అలియాస్ మహ్మద్ షఫీ సహకరించారు. ముగ్గురు కలిసి ఇద్దరు యువతులను నరబలి ఇచ్చారు. 50 ఏళ్లుగా లాటరీ టికెట్లు అమ్ముకుంటున్న ఇద్దరు మహిళలను వీరు టార్గెట్ చేశారు. వీరిద్దరు కేరళలోని కడవంతర, కాలడి నివాసితులు. వీరిలో ఒకరు ఈ ఏడాది జూన్ లో కనిపించకుండాపోగా.. మరో మహిళ సెప్టెంబర్ నుంచి అదృశ్యం అయింది. వీరిద్దరిని గొంతు కోసి, శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేసి నరికి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు భగవల్ సింగ్, లైలా తిరువల్ల నివాసితులు కాగా.. షఫీ పెరుంబవూర్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో మాంత్రికుడు రషీద్ మొదటి నిందితుడు కాగా.. భగవల్ సింగ్ రెండో నిందితుడిగానూ, అతడి భార్య లైలా మూడో నిందితురాలిగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 52 ఏళ్ల పద్మ, 50 ఏళ్ల రోస్లిన్‌ను… రషీద్ ఎలంతూర్‌లో భగవల్ సింగ్ దంపతుల నివాసానికి తీసుకువచ్చి.. సింగ్ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు. రషీద్ సూచనల మేరకు పద్మను 5 ముక్కలుగా, రోస్లిన్‌ను 56 ముక్కలుగా చేసినట్లు తెలిసింది. ఆ శరీరభాగాల్లో కొన్నింటిని వండుకుని ముగ్గురూ తిన్నట్లు భావిస్తున్నారు. వండుకుని తిన్నారని ఆరోపణలు ఉన్నా ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్ టవర్ లొకేషన్స్ సాయంతో నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరికొంత మందిని నరబలి ఇవ్వాలని నిందితులు యోచిస్తున్నట్లు వారి విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో కీలక నిందితుడు అయిన షఫీ లైంగిక ఆనందం కోసం ఎక్కడిదాకా అయినా వెళ్తాడు. చంపేందుకు కూడా వెనకాడడని తెలిసింది. గతంలో కొందరు సెక్స్‌వర్కర్లపై కూడా దాడి చేసినట్లు తేలింది. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవాళ్లే లక్ష్యంగా డాక్టర్ శ్రీదేవి పేరుతో ఒక ఫేస్‌బుక్ అకౌంట్‌ను తెరిచాడు. ఈ అకౌంట్ ద్వారానే ఆర్థికంగా చితికిపోయి ఉన్న భగవల్ సింగ్ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. తాను మంత్రిగాడినని కష్టాలు తొలగిస్తానని నమ్మబలికి.. మానసిక ఆనందం పొందాలని చూసినట్లు పోలీసులు వెల్లడించారు.
భర్తకు దూరంగా లాటరీ టికెట్లు అమ్ముకుంటున్న రోస్లీని మొదట లక్ష్యంగా చేసుకున్న షఫీ.. పోర్న్ చిత్రాల్లో నటిస్తే రూ.10లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో ఆమె ఆ పనికి సిద్ధపడింది. జూన్ 6న ఆమె షఫీ వెంట వెళ్లగా.. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పద్మను.. పడక సుఖం ఇస్తే డబ్బులు ఇస్తానని అన్నాడు. నమ్మి వెంట వెళ్లిన ఆమె కూడా తిరిగిరాలేదు. పోలీసుల విచారణలో నరబలి ఉదంతం, షఫీ రాక్షసత్వం విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.