Congress: కేరళ ఎన్నికల నగారా.. 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!

Kerala Assembly Elections 2

Kerala Assembly Elections 2

Congress: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మంగళవారం (మార్చి 17) నాడు 55 మంది అభ్యర్థులతో కూడిన తన తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశంలో ఈ పేర్లకు ఆమోదం ముద్ర వేశారు.

READ ALSO: Dhurandhar : 30 ఏళ్ల క్రితం పాటకి 46 లక్షలిచ్చారు!

జాబితాలో కీలక అభ్యర్థులు వీరే..
కాంగ్రెస్ తన తొలి జాబితాలో అనుభవానికి, యువతకు పెద్దపీట వేసింది. తొలి జాబితాలో 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి అవకాశం కల్పించారు కాంగ్రెస్ పెద్దలు. హరిపాడ్ నుంచి సీడబ్ల్యూసీ సభ్యుడు రమేష్ చెన్నితాల, పెరవూర్ నుంచి ప్రతిపక్ష నాయకుడు వి.డి.సతీసన్ బరిలోకి దిగనున్నారు. అలాగే కేరళ పీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ కూడా పెరవూర్ నుంచే పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఊమెన్ చాందీ కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే చాందీ ఊమెన్ పుతుప్పల్లి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇతర ప్రముఖులలో వట్టియూర్కావు నుంచి కె.మురళీధరన్, చిరాయింకీజు నుంచి రమ్య హరిదాస్ బరిలోకి దిగనున్నారు.

ఎన్నికల షెడ్యూల్ ఇలా..
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కేరళలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల గడువు మార్చి 23తో ముగియనుండగా, పోలింగ్ ఏప్రిల్ 9న (ఒకే విడత) జరగనుంది. ఎన్నికల ఫలితాలు మే 4న రాబోతున్నాయి. డిజిటల్ ప్రచారంలో వెనకబడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని పటిష్టం చేసింది. ఎన్నికల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి జాతీయ కన్వీనర్‌గా ప్రణవ్ వచ్ఛరాజని, జాతీయ కోఆర్డినేటర్‌గా విపిన్ యాదవ్‌ను నియమించింది. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉండగా, ప్రస్తుతం శాసనసభ పదవీకాలం మే 23తో ముగియనుంది. గత 2021 ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF) 99 స్థానాలు గెలుచుకుని వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకుంది. ఈసారి ఎలాగైనా కేరళ కోటపై జెండా ఎగురవేయాలని యూడీఎఫ్ (UDF) భావిస్తోంది.

READ ALSO: SS Thaman: నాకు కాపీ కొట్టడం రాదు.. అందుకే దొరికిపోతా: థమన్