NTV Telugu Site icon

Kejriwal: ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా!?

Ke

Ke

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన పదవిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేయరంటూ మరొక వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఆప్ నేతలు కొట్టిపారేస్తున్నారు. జైల్లో ఉన్న.. ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని.. అక్కడ నుంచే పరిపాలిస్తారని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఇది సాధ్యం కాని అంశం. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి మరొకరిని తన స్థానంలో కూర్చుండబెట్టొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం అస్థిరపడకుండా ఉండాలంటే.. మరో ముఖ్యమంత్రిని ఎంచుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజా పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్ న్యాయ బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ అధికారుల బలవంతపు చర్య నుంచి రక్షణ కల్పించాలని.. ఇందుకోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర పిటిషన్‌పై ధర్మాసనం స్పందించాలని కోరారు. కానీ శుక్రవారం రావాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

అతిషి వ్యాఖ్యలు..

అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రజలకు ప్రేమ, అభిమానం అని మంత్రి అతిషి తెలిపారు. ఏవో కారణాలు చూపి కేజ్రీవాల్‌‌ను అరెస్ట్ చేయొచ్చు.. కానీ అతని ఆలోచనలను అరెస్ట్ చేయలేరని తెలిపారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తే వీధిలో మరో కేజ్రీవాల్ పుట్టుకొస్తారని పేర్కొన్నారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఫోన్ తీసుకున్నారని.. కేజ్రీవాల్ సెక్రటరీ మొబైల్ కూడా తీసుకున్నారని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్‌తో బీజేపీ పన్నాగం బయటపడింది అని సౌరభ్ భరద్వాజ్, అతిషి ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని.. జైలు నుంచి పాలన సాగిస్తారని అతిషి స్పష్టం చేశారు.

లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు ఆరోపించారు. కేజ్రీవాల్ సర్కార్ 2021లో లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు. 2022లో ఈ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ముడుపులకు అనుకూలంగానే ఈ పాలసీని తీసుకొచ్చారని ఈడీ ఆరోపించింది.

Show comments