శివ భక్తుల నిరీక్షణ ఫలించింది. శుక్రవారం కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. ఉదయం 7.10 గంటలకు కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేదార్‌నగరి ‘జై కేదార్’ నినాదాలతో మారుమోగింది. ఈరోజు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు కేదార్‌నాథ్ దర్శనం కోసం తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగింది. హెలికాప్టర్‌పై నుంచి పూలవర్షం కురిపించారు. వేలాది మంది భక్తుల హర్షధ్వానాలతో బాబా కేదార్ పంచముఖి డోలీ కేదార్‌నాథ్‌కు చేరుకుంది. నిన్న సాయంత్రం వరకు, మొదటి రోజు బాబా కేదార్ దర్శనం కోసం 16 వేల మందికి పైగా భక్తులు కేదార్‌పురికి చేరుకున్నారు.
READ MORE: Puri Jagannadh : నిన్ను అవమానించిన వారికీ నువ్విచ్చే సమాధానం అలా ఉండాలి..
అక్షయ తృతియ సందర్భంగా కేదార్ నాథ్ ఆలయాన్ని ముస్తాబు చేశారు. 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు ఈరోజు తెరుచుకున్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్ ఆలయం ఒకటి. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలంగా చెబుతారు. చార్‌ధామ్ యాత్రలో కేదార్ నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుంటారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. మంచు కారణంగా ఆలయాన్ని మూసేస్తారు. శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు. ఈ సారి కేదార్ నాథ్ కు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. యాత్రికుల సౌకర్యార్థం పర్యటక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.