Kavya Maran and Anirudh Ravichander: సన్ గ్రూప్ ఉద్యోగులకు నూతన దంపతులు కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. గ్రీస్‌లో వివాహం చేసుకున్న ఈ జంట.. పెళ్లి సంబరాలను ఉద్యోగులతోనూ పంచుకుంటోంది. చెన్నైలోని సన్ గ్రూప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ప్రత్యేక లంచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విందు కార్యక్రమంలో కావ్య మారన్, అనిరుధ్ స్వయంగా పాల్గొని ఉద్యోగులను పలకరించారు. వారితో కలిసి ఫొటోలు దిగుతూ, కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అనిరుధ్, కావ్య మారన్ పింక్ కలర్ దుస్తుల్లో మెరిశారు. వీరిద్దరూ ఉద్యోగులతో కలివిడిగా గడిపిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ విందులో ఏర్పాటు చేసిన భోజనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉద్యోగుల కోసం భారీ స్థాయిలో విందు ఏర్పాటు చేశారు. ఇందులో బిర్యానీతో పాటు పలు రకాల నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేశారు. ఇక డెజర్ట్‌లలో ఐస్‌క్రీమ్, గులాబ్ జామ్ వంటి స్వీట్లు ప్రత్యేకంగా అందించారు. ఈ విందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో వైరల్ గా మారాయి. కాగా, పెళ్లి వేడుకల సందర్భంగా కూడా సన్ గ్రూప్ ఉద్యోగులకు కావ్య మారన్ కుటుంబం ప్రత్యేక బహుమతులు అందించాయి. ఉద్యోగులకు లంచ్ ఆహ్వాన పత్రికలతో పాటు చాక్లెట్లు, బంగారు ఉంగరాలు ఉన్న గిఫ్ట్ బాక్సులను పంపినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. గిఫ్ట్ బాక్సులు తెరిచి చూసిన ఉద్యోగులు అందులో బంగారు ఉంగరాలు ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన దృశ్యాలు చర్చనీయాంశమయ్యాయి.
ఇక కావ్య మారన్ విషయానికి వస్తే.. ఆమె సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అనిరుధ్ రవిచందర్ ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల గ్రీస్‌లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. చెన్నైలో రెండు ప్రత్యేక రిసెప్షన్లు కూడా నిర్వహించింది. ఇప్పుడు ఉద్యోగుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.

