Kavitha: కరీంనగర్ జిల్లాలో కవిత మొదటి రోజు పర్యటన కొనసాగుతోంది. మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మొంథా తుపాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయటం లేదు. దానికి తోడు వర్షాల కారణంగా రైతు పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. ఎకరాకు రూ. పదివేలు పరిహారం ఇస్తామంటే ఏ మూలకు సరిపోదన్నారు. రైతులకు మేలు జరగాలంటే ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొలకెత్తిన, బూజు పట్టిన, తేమ శాతం ఎక్కువ ఉన్న సరే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కరీంనగర్ లోని తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామం కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యాన్ని నెల రోజులుగా ఉంచారని చెప్పారు. నెల రోజులుగా ధాన్యం కుప్పలు పోసి ఉంచారన్నారు. ధాన్యానికి మెులకలు వస్తున్నాయి. మొత్తం దారుణంగా తడిసి పోయిందన్నారు.
READ MORE: iQOO Neo 11: మరీ ఇంత బాగుందేందయ్యా ఈ స్మార్ట్‌ఫోన్.. చూస్తుంటేనే కొనాలనిపిస్తోంది!
ఇప్పటి వరకు అసలు కొనుగోలు కేంద్రాలే ఎందుకు ప్రారంభించలేదని కలెక్టర్ ని ప్రశ్నించారు కవిత. “తేమ శాతం ఎక్కువ ఉన్న, బూజు పట్టిన, మొలకలు వచ్చిన సరే ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. భూమి దస్తావేజులు లేవంటూ కౌలు రైతుల ధాన్యం కొంటలేరని చెబుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు పంట నష్టం అంచనా వేయలేదు. ప్రభుత్వం, కలెక్టర్, అధికారులు ఏం చేస్తున్నారు? వెంటనే ఫీల్డ్ లోకి వచ్చి పంట నష్టం అంచనా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మొంథా తుఫానుపై రివ్యూ చేసి.. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైతులకు నష్టం జరగకుండా ఉండాలంటే ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటికే బీహర్ లో ఎన్నికల కారణంగా కూలీలు రావటం లేదు. దీంతో రైతులు అదనపు కూలీ చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ ఇవ్వలేదు. పైగా వర్షాలతో పంట నష్టం జరుగుతోంది. డైరెక్ట్ గా మిల్లర్లే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.” అని ఆమె డిమాండ్ చేశారు.
