ట్యాక్సీ సర్వీస్ ధరలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇష్టమొచ్చినట్లు ఛార్జీలు వసూలు చేయకుండా ధరలకు సర్కార్ కళ్లెం వేసింది. ఓలా, ఉబర్ వంటి సంస్థలతో పాటు ఇతర ట్యాక్సీ సర్వీస్‌లకు (Taxi Services) ఫిక్స్‌డ్ ఛార్జీలను అమలు చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రభుత్వం (Siddaramaiah Government) ప్రకటించింది.
ఇందుకోసం ‘ఫిక్స్‌డ్ ఫేర్ రూల్’ పేరుతో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఆయా క్యాబ్ సంస్థలు వినియోగదారుల నుంచి ఇష్టానుసారంగా ధరలను వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది (Karnataka). తక్షణం ఈ ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. తాజా నిబంధనల ప్రకారం వాహనం ఖరీదు ఆధారంగా క్యాబ్ సర్వీస్‌లను మూడు భాగాలుగా విభజించింది.
ఏఏ వాహనాలకు ఎంత ధర అంటే..
- వాహనం ధర రూ.10 లక్షల కంటే తక్కువైతే..
మొదటి 4 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.100
తర్వాత ప్రతి అదనపు కి.మీ. రూ.24 చెల్లించాలి - కారు ఖరీదు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉంటే..
కనీస ఛార్జీ రూ.115 కాగా, అదనపు కి.మీ రూ.28 చెల్లించాలి - వాహనం ధర రూ.15 లక్షలు దాటితే..
తొలి 4 కి.మీ. కనీస ఛార్జీ రూ.130
తర్వాత ప్రతి కి.మీ. రూ.32 చెల్లించాలి
- క్యాబ్ బుక్ చేసిన తర్వాత మొదటి ఐదు నిమిషాల వెయిటింగ్ ఉచితం
తర్వాత ప్రతి నిమిషానికి ఒక రూపాయి ఛార్జీ వర్తిస్తుంది
ఇక యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీస్‌ను అందించే సంస్థలు ఐదు శాతం జీఎస్టీతోపాటు, టోల్ ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతించింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య క్యాబ్ సర్వీస్‌లను అందించే సంస్థలు సాధారణ ధరలకు అదనంగా పది శాతం వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.