Site icon NTV Telugu

Karnataka Farmer : లంచమివ్వలేను.. ఈ ఎద్దును తీసుకోండి సారు

Karnataka Farmer

Karnataka Farmer

Karnataka Farmer : ప్రభుత్వ ఆఫీసుల్లో పైసలివ్వనిదే ఏ పని కాదన్న విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు. అన్నం పెట్టే రైతన్నను లంచం డిమాండ్ చేశాడో ప్రభుత్వోద్యోగి. దీంతో అధికారి అడిగిన డబ్బులు ఇచ్చుకోలేని రైతు.. తన పని కోసం ప్రేమగా సాదుకునే ఎద్దును లంచంగా తీసుకోమని బతిమిలాడాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. అది కూడా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా అయిన హవేరిలో కావడం గమనార్హం. జిల్లాలోని సవనూర్ మునిసిపాలిటీకి చెందిన ఎల్లప్ప రానోజి అనే రైతు మునిసిపల్ రికార్డుల్లో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పని చేసి పెట్టేందుకు సంబంధిత అధికారి లంచం డిమాండ్ చేశాడు. మరో దారిలేక లంచం సమర్పించుకున్నప్పటికీ పని చేయకుండానే ఆ అధికారి బదిలీ అయ్యాడు.

Read Also: Menstrual Blood : రక్తం ఖరీదు రూ.50వేలు.. కోడలిది తీసి మంత్రగాడికి అమ్మిన అత్త

కొత్తగా వచ్చిన అధికారి కూడా లంచం డిమాండ్ చేశాడు. డబ్బు ఇస్తేనే పని జరుగుతుందని తేల్చి చెప్పాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ రైతు తన వద్ద ఉన్న ఎద్దునే లంచంగా ఇవ్వాలనుకున్నాడు. దానినే కార్యాలయానికి తీసుకెళ్లాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి వైరల్ అయింది. లంచం ఇచ్చుకోలేని రైతు ఎల్లప్ప ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో తనకున్న ఎద్దుల్లో ఒకదానిని కార్యాలయానికి తీసుకొచ్చి డబ్బులకు బదులుగా ఎద్దును లంచంగా తీసుకోవాలని బతిమాలాడు. దీంతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం కాస్తా ఉన్నతాధికారులకు తెలియడంతో స్పందించారు. లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎల్లప్ప పనిచేసి పెడతామని హామీ ఇచ్చారు.

Exit mobile version