NTV Telugu Site icon

BJP vs Congress: ఢిల్లీ వేదికగా హీటెక్కిన కర్ణాటక రాజకీయం

Cong Bjp

Cong Bjp

కర్ణాటక (Karnataka Congress) రాజకీయాలు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా హీటెక్కాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం పక్షపాతం చూపిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రభుత్వం ఆరోపించింది. దీంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ (DK Shivakumar) సారథ్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆందోళనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్రం తీరును ఎండగడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.

మరోవైపు కాంగ్రెస్‌కు కౌంటర్‌గా ఢిల్లీ, కర్ణాటకలో బీజేపీ (BJP) కూడా నిరసనలకు దిగింది. కేంద్రం ఇస్తున్న నిధులను కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. సిద్ధరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నదాతలను ఆదుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు.

ఆందోళనలో భాగంగా బీజేపీ శ్రేణులు కర్ణాటకలో దూకుడుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) తాళాలు వేసేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అదుపు చేసేందుకు వాటర్ ఫిరంగులు ఉపయోగించారు. ఈ సందర్భంగా బీజేపీ-పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

బీజేపీ ఫైర్..
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలుపుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారని బీజేపీ ఆరోపించింది. ఇదిలా ఉంటే ఆర్థిక కేటాయింపులు, పన్నుల కేటాయింపుపై కేంద్రం-కాంగ్రెస్ సర్కార్‌ మధ్య గత రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. నిరసనలు ఇంతటితో ముగుస్తాయా? లేదంటే సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగుతాయో వేచి చూడాలి.