Madal Virupakshappa: కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప తన కుమారుడు కేఏఎస్ అధికారి ప్రశాంత్ మదాల్ ద్వారా లంచం డిమాండ్ చేశారన్న అభియోగంపై లోకాయుక్త పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తన కుమారుడు లంచం తీసుకుంటూ పట్టుబడటంతో కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్‌డీఎల్) ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్పను లంచం కేసులో లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు.
ప్రఖ్యాత మైసూర్ శాండల్ సోప్‌ను తయారు చేసే కేఎస్‌డీఎల్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో విరూపాక్షప్ప ముందస్తు బెయిల్ దరఖాస్తును హైకోర్టు సోమవారం కొట్టివేసిన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. దావణగెరె జిల్లా చన్నగిరి ఎమ్మెల్యే విరూపాక్షప్పను తుమకూరు క్యాత్సంద్ర టోల్ సమీపంలో సోమవారం లోకాయుక్త పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరుకు తీసుకెళ్తున్నారు. లోకాయుక్త ప్రకారం, బిల్లు పాస్ చేయడానికి రూ.81 లక్షలు లంచం డిమాండ్ చేయబడింది. విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ తన కార్యాలయంలో రూ.40 లక్షలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం విరూపాక్షప్ప నివాసంలో రూ.7 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో ప్రశాంత్‌ను మార్చి 2న అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితుడిగా ఉన్న మాదాల్ విరూపాక్షప్ప రూ. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై కర్ణాటక హైకోర్టు నుంచి మధ్యంతర ముందస్తు బెయిల్‌ను పొందారు, దీంతో ఈరోజు వరకు అరెస్టు నుంచి తప్పించుకున్నారు.
Read Also: Bribery Case: బ్యాగు నిండా డబ్బులు.. భార్య చేసిన పనికి షాక్
వివరాలు ఇలా.. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రశాంత్ గురువారం కర్ణాటక సోప్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ (కేఎస్‌డీఎల్) కార్యాలయంలో ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేఎస్‌డీఎల్‌కు విరూపాక్షప్ప ఛైర్మన్‌గా ఉన్నారని.. ప్రశాంత్ తన తండ్రి తరపున లంచం మొదటి విడతగా తీసుకుంటున్నారని లోకాయుక్త వర్గాలు తెలిపాయి. కేఎస్‌డీఎల్ కార్యాలయం నుంచి మూడు బ్యాగుల నిండా నగదును పోలీసులు గుర్తించారు. ప్రశాంత్‌ను అరెస్టు చేసిన వెంటనే లోకాయుక్త అధికారులు ఆయన ఇంటిపై శుక్రవారం దాడి చేసి తమ కార్యకలాపాలను కొనసాగించారు. ప్రశాంత్ ఇంట్లో రూ.6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్బులు, డిటర్జెంట్ తయారీ కోసం కేఎస్‌డీఎల్‌కు అవసరమైన రసాయనాలను సరఫరా చేసిన కాంట్రాక్టర్ నుంచి ప్రశాంత్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఎమ్మెల్యే కుమారుడు రూ.81 లక్షలు డిమాండ్ చేయగా.. మొదటి విడతగా రూ.40 లక్షలు ఇచ్చారు. లంచం డిమాండ్‌పై కాంట్రాక్టర్ వారం రోజుల క్రితం లోకాయుక్తను ఆశ్రయించగా.. ఆ తర్వాత ఇలా ఉచ్చు బిగించారు.