Karbonn Rebel Series: దేశీయ టెక్ బ్రాండ్ కార్బన్ (Karbonn) మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. త్వరలోనే తన కొత్త రెబెల్ (Rebel) సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. కార్బన్ రెబెల్ ప్రో (Karbonn Rebel Pro), కార్బన్ రెబెల్ (Karbonn Rebel) పేర్లతో ఈ ఫోన్లను తీసుకురానుంది. ఇప్పటికే ఈ రెండు ఫోన్లకు సంబంధించిన మైక్రోసైట్ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో డిజైన్, కీలక ఫీచర్లు, బ్యాటరీ, డిస్‌ప్లే వివరాలను కంపెనీ వెల్లడించింది.
కార్బన్ రెబెల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు అమెజాన్ ద్వారా అమ్మకాలకు రానున్నాయి. రెబెల్ ప్రో మోడల్ బ్లూ, బర్గండీ, గోల్డ్, గ్రే రంగుల్లో అందుబాటులో ఉండనుంది. సాధారణ రెబెల్ మోడల్ బ్లూ, గోల్డ్, సిల్వర్ రంగుల్లో లభించనుంది. అయితే ఈ ఫోన్ల ఖచ్చితమైన లాంచ్ తేదీ, ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కార్బన్ రెబెల్ ప్రో ఫోన్ ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్‌తో రానుంది. వెనుక భాగంలో ఎడమవైపు పైభాగంలో నిలువుగా ఉండే దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ను అందించారు. కుడివైపు పవర్, వాల్యూమ్ బటన్లు ఉండనున్నాయి. దిగువ భాగంలో కార్బన్ బ్రాండింగ్‌తో పాటు యూఎస్‌బీ టైప్-సీ పోర్టును ఏర్పాటు చేశారు. ఇక సాధారణ రెబెల్ మోడల్ కూడా ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్‌తోనే రానుంది. అయితే ఇందులో వెనుక కెమెరాల కోసం అడ్డంగా ఉండే దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌ను అందించారు. ఇందులో మూడు కెమెరా కటౌట్లు త్రిభుజాకార అమరికలో ఉండగా, పక్కనే ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటుంది.
బ్యాటరీ విషయంలో రెండు మోడళ్లలోనూ భారీ సామర్థ్యాన్ని అందిస్తున్నారు. కార్బన్ రెబెల్ ప్రోలో 6,000mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 20W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లోనే 20W ఛార్జింగ్ అడాప్టర్, యూఎస్‌బీ టైప్-C కేబుల్‌ను అందించనున్నారు. మరోవైపు సాధారణ రెబెల్ మోడల్‌లో 7,000mAh బ్యాటరీతో పాటు 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. రెబెల్ ప్రోలో 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్ఠంగా 720 నిట్స్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. సాధారణ రెబెల్ మోడల్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ+ టచ్‌స్క్రీన్ ఉండనుంది. దీని గరిష్ఠ బ్రైట్‌నెస్ 650 నిట్స్‌గా ఉంటుంది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనున్నాయి. ఎలాంటి అనవసరమైన ముందస్తు యాప్స్ (బ్లోట్‌వేర్) లేకుండా సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తామని కార్బన్ ప్రకటించింది. అంతేకాకుండా రెండేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్, రెండు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లను అందించనున్నట్లు వెల్లడించింది. అయితే ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, లాంచ్ తేదీ వివరాలు తెలియాల్సి ఉంది.

