శివలింగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కరాటే కల్యాణి. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. సనాతన హిందూ సంఘం ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు. ఇలాంటి వారిపై హిందువులంతా ఏకమై న్యాయపోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 100 కోట్ల మంది హిందువుల దైవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపించారు.
నుపూర్ శర్మ వ్యవహారంలో అనేక కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, ఈ తరహా ఘటలనపై సైతం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా సయ్యద్ షరీఫ్ఉద్దీన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో హిందువుల దైవం శివలింగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆ వ్యక్తిపై తక్షణం పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కరాటే కల్యాణి డిమాండ్ చేశారు.
ప్రస్తుతం మహ్మద్ ప్రవక్తను బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల తరువాత పెద్ద ఎత్తున ముస్లింలు ఆందోళన చేశారు. శుక్రవారం దేశవ్యాప్తంగా యూపీ, జార్ఖండ్, ఢిల్లీ పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. కొన్ని చోట్ల రాళ్ల దాడులతో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే ఈ ఘటనపై బీజేపీ పార్టీ తన అధికార ప్రతినిధులను పార్టీ నుంచి తప్పించింది. అయితే ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.
