వన్డే వరల్డ్ కప్( ODI World Cup 2023) ముందు న్యూజిలాండ్ జట్టు(Newzealand)కు శుభవార్త. గాయం నుంచి కోలుకుంటున్న మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈరోజు పోస్ట్ చేశాడు. దానికి ‘చాలా రోజుల తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం సంతోషంగా ఉంది’ అని క్యాప్షన్ రాశాడు. ఆ వీడియోలో విలియమ్సన్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా అన్ని రకాల షాట్లు ప్రాక్టీస్ చేశాడు.
వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని ఉందని అతను ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే వేగంగా కోలుకుంటున్న అతను బ్యాట్ పట్టడంతో న్యూజిలాండ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. న్యూజిలాండ్ జట్టు గొప్ప కెప్టెన్లలో ఒకడైన కేన్ విలియమ్సన్ క్రికెట్‌కు దూరమైన ఐదు నెలలపైనే కావొస్తోంది.
ఐపీఎల్(IPL 2023) ఆరంభ పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ గాయపడ్డాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన బంతని బౌండరీ వద్ద ఆపడానికి ప్రయత్నిచి కింద పడిపోయాడు. దీంతో కుడి మోకాలికి బలమైన గాయం కావడంతో నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడాడు. కుడి కాలు బెణికిందని స్కానింగ్ తీసిన వైద్యులు చెప్పడంతో ఈ స్టార్ ఆటగాడు షాక్ తిన్నాడు. దాంతో, అర్ధాంతరంగా స్వదేశానికి పయనమయ్యాడు. అక్కడ ఈమధ్యే దెబ్బతిన్న కుడి మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు.