Kaleshwaram: కాళేశ్వరంలో కొలువైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు నేటి (శుక్రవారం) నుంచి ఆధ్యాత్మికంగా ప్రారంభమయ్యాయి. 42 ఏళ్ల తరువాత ఈ మహోత్సవాలు జరగడం విశేషం. నేటి నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు పూజా కార్యక్రమాలు భక్తులను భక్తిశ్రద్ధలలో ముంచెత్తనున్నాయి. మహోత్సవం ప్రారంభ వేడుకగా ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలతో కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకున్నారు. అక్కడ ఐదు కలశాలతో గోదావరి జలాలు సేకరించి కుంభాభిషేకానికి తీసుకువచ్చారు.ఆ తర్వాత గోపూజ, గణపతి పూజలతో మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అచ్చలాపురం రుత్వికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ 1,108 కలశాలకు పూజలు చేశారు. మూడు రోజుల పాటు ఆలయం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో రంజిల్లనుంది.
Read Also: OTT : ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘గేమ్ ఛేంజర్’.. ఫ్యాన్స్ షాక్
మహోత్సవాల కారణంగా ఈ మూడు రోజుల పాటు ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. గర్భగుడి దర్శనాలను కూడా నిలిపివేశారు. ఈ మహోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.ఫిబ్రవరి 9న ఉదయం 10:42 గంటలకు తుని పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం జరగనుంది. అనంతరం పీఠాధిపతి అనుగ్రహభాషణం అందించనున్నారు. భక్తులకు ఉచిత ప్రసాదం, అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా దాతలకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేస్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరంలో మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక సందడి నెలకొనబోతోంది. కార్యక్రమంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసారు. భక్తులు ఈ మహోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు పిలుపునిచ్చారు.