నేటి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం కోసం వెతుకుతున్న వారికి.. ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ ప్రాంతంలో పండే ‘కాలా నమక్’ బియ్యం ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తున్నాయి. దాదాపు 2,600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బియ్యాన్ని గౌతమ బుద్ధుడి కాలంలో సాగు చేసేవారు, అందుకే దీనిని ‘బుద్ధ బియ్యం’ (Buddha Rice) అని కూడా పిలుస్తారు. నల్లటి పొట్టుతో ఉండి, ఉడికించినప్పుడు తెల్లగా, సువాసనభరితంగా మారే ఈ బియ్యంలో ఐరన్, జింక్.. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారికి ఈ బియ్యం ఒక సంజీవనిలా పనిచేస్తుంది.
ఇందులో ఉండే ‘ఆంథోసైనిన్స్’ వంటి యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, చర్మ సౌందర్యానికి మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు ఎంతగానో దోహదపడతాయి. రసాయన ఎరువులు లేకుండా సహజ సిద్ధంగా పండించడం వల్ల ఇది పర్యావరణానికే కాకుండా శరీరానికి కూడా ఎంతో సురక్షితం. అలాగే మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు అన్నం తినాలంటే గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి భయపడుతుంటారు, కానీ కాలా నమక్ బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా (49-52) ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
ఇందులో పీచు పదార్థం (Fiber) అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక ఉత్తమ ఆహారం అని చెప్పవచ్చు, ఎందుకంటే ఇది తిన్న తర్వాత ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరిచే విటమిన్-బి కూడా ఇందులో మెండుగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో సాధారణ బియ్యానికి బదులుగా ఈ పోషకాల గనిని చేర్చుకోవడం ద్వారా గుండె జబ్బులను నివారించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఈ సూపర్ ఫుడ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
