Kakinada Firecracker Factory Blast: ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పేలుడు సంభవించింది.. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రమాద సమాచారం అందగానే ఆయన అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రులను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
ఇక, ఈ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు మృతి చెందడం తనను కలచివేసిందని, ప్రభుత్వం బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు. బాణసంచా కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రమాద తీవ్రత దృష్ట్యా రాష్ట్ర మంత్రులు స్పందించారు.. విజయనగరం జిల్లా పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన వేట్లపాలెం బయలుదేరారు. ఎప్పటికప్పుడు ఎస్పీ, కలెక్టర్‌లతో వివరాలు సేకరిస్తున్నారు హోం మంత్రి అనిత.. ఇక, బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేలా DME, DMHOలను ఆదేశించారు. ఘటనా స్థలానికి సూపర్ స్పెషాలిటీ వైద్యులను, అంబులెన్స్‌లను పంపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్.. మరోవైపు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రులు నారా లోకేష్, నారాయణ.. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు.. ఏపీ బీజేపీ నేత మాధవ్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరారు.
కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా తయారీ పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ విస్ఫోటనం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ… బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ దురదృష్టకర ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించే ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.బాణాసంచా పరిశ్రమ నుంచి ఇంకా పేలుళ్లు సంభవిస్తున్నాయని అధికారులు తెలియజేశారు. పేలుళ్లకు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాణాసంచా పరిశ్రమలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచి భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. పరిసర గ్రామాలకు పొగ అలుముకున్న నేపథ్యంలో ప్రజలకు ధైర్యం చెప్పాలని, వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి
కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ లను ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలని దిశానిర్దేశం చేశారు.
కాగా, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ యూనిట్‌లో భారీగా ఉత్పత్తి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 20 మంది వరకు కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు ఏడుగురు మృతి చెందినట్లు ప్రాథమికంగా ధ్రువీకరించగా, శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
