Kaikala Satyanarayana: తెలుగు సినిమా పౌరాణికాలకు పెట్టింది పేరు. పౌరాణికాల్లో అనితరసాధ్యంగా నటించిన నటసార్వభౌములు ఎందరో ఉన్నారు. వారిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు సత్యనారాయణ. ఇక పౌరాణికాలు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది నటరత్న యన్టీఆర్. ఆయన ధరించినన్ని పురాణ పురుషుల పాత్రలు వేరొకరు పోషించలేదు. అందులోనూ నాయక ప్రతినాయకులైన శ్రీరామ-రావణ, భీముడు-దుర్యోధన పాత్రల్లోనూ ఆయన ఎంతగానో అలరించారు. ఆయన ప్రోత్సాహంతోనే `శ్రీకృష్ణావతారం`లో సత్యనారాయణ సుయోధనునిగా నటించి మెప్పించారు. సత్యనారాయణను ఎప్పుడూ వైవిధ్యంగా చూపించాలని తపించిన యన్టీఆర్, తాను దుర్యోధనునిగా నటించిన`దానవీరశూర కర్ణ`లో ఆయనకు భీముని పాత్రను ఇచ్చారు. ఇది యన్టీఆర్ సొంత చిత్రం. యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యన్టీఆర్ శ్రీకృష్ణ, కర్ణ పాత్రల్లోనూ నటించారు.
Read Also : Kaikala Satyanarayana: స్టార్స్ తో సత్యనారాయణ చిత్రాలు!
యన్టీఆర్ సొంత సినిమా అంటే సత్యనారాయణ తన సొంత చిత్రంగా భావించేవారు. అదే సమయంలో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణ , ఏ.ఎస్.ఆర్.ఆంజనేయులుతో కలసి `కురుక్షేత్రం` చిత్రం నిర్మిస్తున్నారు. అందులో దుర్యోధన పాత్రకు సత్యనారాయణను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని రామారావుకు ముందే చెప్పారు సత్యనారాయణ. అందుకు యన్టీఆర్ గో ఎహెడ్ బ్రదర్… అంటూ ఆశీర్వదించారు. భారత కథ ఆధారంగా రూపొందిన `దానవీరశూర కర్ణ`, `కురుక్షేత్రం` రెండు చిత్రాలు 1977లో ఒకే రోజున అంటే జనవరి 14న జనం ముందు నిలిచాయి. ఒకే రోజు ఒకే ఇతివృత్తంతో రెండు పౌరాణిక చిత్రాలు విడుదల కావడం అన్నది తెలుగు సినిమా పలుకు నేర్చిన రోజుల్లోనూ జరిగాయి. అయితే రంగుల చిత్రాలు వచ్చాక, ఆ పోటీ 1977లోనే తొలి, చివరి సారిగా జరిగిందని చెప్పవచ్చు. ఈ రెండు చిత్రాలలో సత్యనారాయణ పూర్తి విరుద్ధమైన రెండు పాత్రలు ధరించడం విశేషం. `దానవీరశూర కర్ణ`లో భీమునిగా, `కురుక్షేత్రం`లో దుర్యోధనునిగా సత్యనారాయణ ఒకే రోజున ప్రేక్షకుల ముందు నిలవడం మరింత విశేషం. ఇలాంటి అరుదైన సంఘటన సత్యనారాయణ ఒక్కరి విషయంలోనే జరగడం మరపురాని విశేషం!
