నేడు కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. శుక్రవారం ఉదయం జరిగే ఈ సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈరోజు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగకుంటే.. బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. గత ఆరు నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు. ఆరు నెలలు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే.. మున్సిపల్ ఆక్ట్ ప్రకారం కమిటీ రద్దయ్య అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఎలాగైనా నిర్వహించాలని వైసీపీ చూస్తోంది. కార్పొరేషన్ సమావేశం జరగకుండా అడ్డుకుంటారని, భద్రత కల్పించాలంటూ ఇప్పటికే కోర్టును మేయర్ సురేష్ బాబు ఆశ్రయించారు.
కడప మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 53 మంది ఏఎస్ఐలు,110 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 4 స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరా, నేత్రా-వజ్ర వాహనం ద్వారా నిఘా పెట్టారు. ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ వద్దకు పోలీసులు స్పెషల్ పార్టీ బలగాలు చేరుకుంటున్నాయి.
Also Read: PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ వేదికపై ఎమ్మెల్యేకి కుర్చీ ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. గత కొంతకాలంగా కడప ఎమ్మెల్యే మాధవి వేదికపై కుర్చీ కోసం పోరాడుతున్నారు. ఎట్టకేలకు సమావేశ వేదికపై మేయర్‌తో పాటు ఎమ్మెల్యేకి కుర్చీ ఏర్పాటు చేశారు. కుర్చీ గోలకు పుల్‌స్టాప్ పెట్టడానికి వేదికపై ఎమ్మెల్యేకి అధికారులు కుర్చీ ఏర్పాటు చేశారు.
