NTV Telugu Site icon

Kadapa DTC: కడప రవాణాశాఖలో కీచక అధికారిపై మంత్రి వేటు!

Mister Ramprasad Reddy

Mister Ramprasad Reddy

కడప రవాణాశాఖలో కీచక అధికారిపై మంత్రి వేటు వేశారు. కడప రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బదిలీ వేటు వేశారు. సమగ్ర విచారణ తక్షణమే చేపట్టి.. అధికారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అధికార్లు రవాణాశాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించినట్లు కడప డీటీసీపై ఆరోపణలు ఉన్నాయి.

కడప డీటీసీ చంద్రశేఖర్‌ రెడ్డి గురువారం మహిళా బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంటికి వెళ్లి వేధించాడు. దీంతో మహిళా ఉద్యోగి కుటుంబసభ్యులు అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కడప డీటీసీపై బదిలీ వేటు వేసి రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయంలో రిపోర్టు చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. కడప డీటీసీపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. బాపట్ల, శ్రీకాకుళంలో పని చేసిన సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

మహిళా ఉద్యోగిపై రవాణా అధికారి లైంగిక వేధింపులకు పాల్పడటంపై రవాణాశాఖ మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ తక్షణమే చేపట్టి శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పని చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇటువంటి దుష్ప్రవర్తనను ఉపేక్షించేది లేదన్నారు. భవిష్యత్తులో మరో అధికారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటానికి తావు ఇవ్వకుండా చర్యలు ఉంటాయని తెలిపారు. అధికార్లు రవాణాశాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని మంత్రి సూచించారు.