Jurala Water: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, ముధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కృష్ణా జలాలు విడుదల చేయాలని వారు కోరారు. నారాయణపూర్ నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతుల దుస్థితిని డీకేకు వివరించారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ 4 ప్రాజెక్టుల కింద 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోందని వివరించారు. ప్రస్తుతం ఆయకట్టు పరిధిలోని పంటలు కీలక దశలో ఉన్నాయని.. నీటి కొరత వస్తే పంట దిగుబడులపై ప్రభావం పడుతుందని వివరించారు. అంతేకాకుండా రైతుల ఆదాయం, జీవనోపాధిపై ప్రభావం పడుతుందని మంత్రులు తెలిపారు. నెలలో 5 వేల క్యూసెక్కుల కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరారు. మంత్రుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం డీకే శివకుమార్.. తెలంగాణ రైతులకు లాభం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు అధికారులు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సానుకూల నిర్ణయంతో నీటి విడతలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు కూడా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బెంగళూరులోనే ఉన్నారు. గతరాత్రి కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. నారాయణపూర్ నుండి జూరాలకు దశలవారీగా 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈరోజు మరోసారి కర్ణాటక సీఎం, ఇరిగేషన్ మంత్రి, అధికారులతో ఎమ్మెల్యేలు భేటీకానున్నారు. నారాయణపూర్ లో ప్రస్తుతం 28 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.

