FITUR పేరుతో ప్రఖ్యాతిగాంచిన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో జరిగే అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్లో పాల్గొనేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ బృందం మాడ్రిడ్ చేరుకుంది. ఈ అంతర్జాతీయ పర్యాటక, వాణిజ్య ప్రదర్శన జనవరి 24 నుంచి జనవరి 28 వరకు మాడ్రిడ్ లోని IFEMAలో జరగనుంది.
అంతర్జాతీయ పర్యాటక నిపుణుల వేదిక మాత్రమే కాదు ఈ FITUR ప్రఖ్యాత వాణిజ్య ప్రదర్శన కూడా. ప్రకృతి, పర్యావరణం, సాహసాలు, చారిత్రిక. ఆధ్యాత్మిక రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో టూరిజానికి ఉన్న అవకాశాలను తెలంగాణ బృందం ఈ ప్రదర్శనలో ప్రదర్శించనుంది. పర్యాటక రంగంలో చోటుచేసుకుంటున్న తాజా ధోరణులను తెలంగాణ బృందం ఈ పర్యటనలో అధ్యయనం చేయనుంది.
పర్యాటక విభాగాన్ని ఆదాయ వనరుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నమంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పర్యటనలో పర్యాటక రంగంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించనున్నారు.
ఫలితంగా తెలంగాణలో టూరిజం విభాగంను ఆదాయ ఆర్జన విభాగంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి మరింత ఊతం లభించనుందని, తద్వారా ప్రపంచ పర్యాటకులు తెలంగాణ ను సందర్శించే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.
