Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ విషాదం చోటుచేసుకుంది. అభ్యర్థిగా పోటీలో ఉన్న 40 ఏళ్ల మహమ్మద్ అన్వర్ గుండెపోటుకు గురై మరణించారు. ఎర్రగడ్డలో నివాసి అన్వర్ కౌంటింగ్ ప్రక్రియపై ఉత్కంఠ ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఛాతి నొప్పితో కుప్పకూలినట్లు తెలుస్తోంది. కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించారని వైద్యులు ధృవీకరించారు. ఎన్నికల ఫలితాలపై ఆసక్తి, ఒత్తిడి, ఉత్కంఠ అన్వర్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపినట్టు అనుమానిస్తున్నారు. ఉప ఎన్నికల సందర్భంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిలిల్చింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాజకీయ వర్గాలు కూడా అన్వర్ ఆకస్మిక మరణంపై సంతాపం వ్యక్తం చేశాయి.
READ MORE: Investement: మీరు ఒకే సారి మొత్తం అమౌంట్ తో ఇళ్లు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. యూసఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీ భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 10 రౌండ్లలో, 42 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్‌కు ప్రత్యేకంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ పనుల్లో 186 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
మొదటిగా పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. మొత్తం ప్రక్రియ రెండు నుంచి మూడు గంటల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,01,365 మంది. నవంబర్ 11న జరిగిన పోలింగ్‌లో 48.49 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పోలైన ఓట్లు 1,94,621. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ముందుగా షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. ప్రతి దశలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజల దృష్టి కౌంటింగ్ కేంద్రంపైనే నిలిచింది. ఎవరి వైపు ప్రజాభిప్రాయం మొగ్గుచూపిందన్నది ఇంకొద్ది గంటల్లోనే తేలనుంది.
