Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో నియోజకవర్గం అంతటా నెలకొన్న రాజకీయ సందడికి తెరపడింది. అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు చివరి నిమిషం వరకు గెలుపు కోసం హోరాహోరీగా కృషి చేశారు. రోడ్డుషోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలతో నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Jubilee Hills Election 2025: జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహాలతో కెటీఆర్ స్పీచ్!
ఈ ఉపఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ప్రచారం చేయగా.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి ముఖ్య నేతలు ప్రచార బాధ్యతలను నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా సీనియర్ నాయకులు ముమ్మర ప్రచారం చేపట్టారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు పార్టీలు పక్కాగా ప్రణాళికలు రచించుకున్నాయి. ముఖ్యంగా డివిజన్ల వారీగా లెక్కలు వేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. ఈ ప్రధాన పార్టీల మధ్య జరిగిన డైలాగ్ వార్ నియోజకవర్గంలో రాజకీయ వేడిని మరింత పెంచింది.
Bihar Assembly Elections 2025: బిహార్‌లో ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్
ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశాల మేరకు ప్రచారం ముగియడంతో నియోజకవర్గ పరిధిలో ఆంక్షలు అమలులోకి వచ్చాయి. సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు వెంటనే నియోజకవర్గ పరిధిని వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశించింది. అంతేకాకుండా జూబ్లీహిల్స్ పరిధిలోని వైన్స్, పబ్బులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ బైపోల్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడనున్నాయి.
