Site icon NTV Telugu

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్!

Maganti Sunitha

Maganti Sunitha

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్‌ సతీమణి మాగంటి సునీత పేరు ఖరారైంది. మాగంటి సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. జూబ్లీహిల్స్‌ నియిజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకే సునీతకు అవకాశం ఇస్తున్నట్లు గులాబీ బాస్ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో బైఎలక్షన్‌జరుగుతున్న విషయం తెలిసిందే.

గత జూన్ 8న జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న గోపినాథ్‌ స్థానంలో ఆయన సతీమణి సునీతకే బీఆర్ఎస్ అధినేత అవకాశం ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 2023 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు.

‘జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణంతో, త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో.. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న దివంగత మాగంటి గోపినాథ్ గారి సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్ధిగా ఎంపిక చేశారు. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా, వారి నిబద్ధతను పరిశీలించిన మీదట, మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు, గౌరవాన్నిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని బీఆర్ఎస్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. సునీత గెలుపు కోసం ప్రతి ఒక్కరికి కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Exit mobile version