JSW Group: ఇక ఎలక్ట్రిక్ ట్రక్కుల వంతు.. 55 టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌తో జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ..

Amsar Truck

Amsar Truck

JSW గ్రూప్ కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అయిన JSW గ్రీన్‌టెక్ లిమిటెడ్ ‘AMPSTAR’ అనే కొత్త బ్రాండ్‌ను లాంచ్ చేయడం ద్వారా కమర్షియల్ మొబిలిటీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ బ్రాండ్ ద్వారా ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులను డిజైన్ చేసి, తయారీ చేసి విక్రయించనుంది. కేవలం వాహనాల విక్రయమే కాకుండా.. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆపరేటింగ్ సొల్యూషన్స్, ఫైనాన్సింగ్ ఆప్షన్స్, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్‌ను కూడా కస్టమర్లకు అందిస్తుంది.

ఈ AMPSTAR వాహనాలు కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా 150 కిలోవాట్ల నుంచి 500 కిలోవాట్ల వరకు పవర్ కాన్ఫిగరేషన్లతో లభిస్తాయి. అంతేకాకుండా.. వాహనాలను నేరుగా కొనుగోలు చేయడం, లీజుకు తీసుకోవడం, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) వంటి విభిన్న ఓనర్షిప్ మోడల్స్‌ను కస్టమర్లు ఎంచుకోవచ్చు. ఈ వాహనాలు భారదేశ వాతావరణం, రోడ్డు పరిస్థితులకు తగినట్లుగా పూర్తిగా ఇన్-హౌస్‌గా డిజైన్ చేయబడ్డాయి.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న AURIC వద్ద గల JSW ఇంటిగ్రేటెడ్ EV తయారీ కేంద్రంలో వీటిని తయారు చేయనున్నారు. రూ. 2,500 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటైన ఈ ప్లాంట్ వార్షికంగా 15,000 ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ తయారీ యూనిట్‌లో ఆటోమేటెడ్ ట్రక్-కేబిన్ లైన్, ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ ఎకోసిస్టమ్ కూడా ఉన్నాయి.

JSW గ్రీన్‌టెక్ లిమిటెడ్ CEO సుమిత్ మిట్టల్ మాట్లాడుతూ.. బస్సుల విభాగంలో 7 మీటర్ల నుంచి 18 మీటర్ల పొడవున్న బస్సులను అందిస్తున్నట్లు తెలిపారు. ఇవి స్టాఫ్ ట్రాన్స్‌పోర్టేషన్, సిటీ, ఇంటర్‌సిటీ, స్కూల్ మొబిలిటీ వంటి వివిధ అవసరాలకు ఉపయోగపడతాయి. ఇక ట్రక్కుల విషయానికి వస్తే.. అత్యంత డిమాండ్ ఉన్న 55-టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌తో ప్రారంభించి, రాబోయే నెలల్లో టిప్పర్లు, ఫిక్స్‌డ్-బాడీ డంపర్‌లకు తమ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు.