Site icon NTV Telugu

Healthy Breakfast for Diabetics: మందులు లేకుండానే షుగర్ కంట్రోల్.. పూర్వీకులు తిన్న ఈ ‘ఆహారం’ సింపుల్‌గా ఇలా చేసేయండి!

Jonna Gadka

Jonna Gadka

Healthy Breakfast for Diabetics: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మన ఆహారపు అలవాట్లు ఎంతగా మారాయో అందరికీ తెలిసిందే. రంగురంగుల ప్యాక్డ్ ఫుడ్స్, అధికంగా పాలిష్ చేసిన బియ్యం మన వంటింట్లో చేరి.. ఊబకాయం, మధుమేహం, బీపీ వంటి వ్యాధులను మనకు బహుమతిగా ఇచ్చాయి. అయితే గతంలో మన పూర్వీకులు మాత్రం వందేళ్లయినా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. దానికి కారణం వారు తీసుకున్న చిరుధాన్యాలే అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ మట్టిలో పుట్టిన ‘తెల్ల జొన్న గడక’ అప్పట్లో ప్రతి ఇంటికి ఒక సంజీవని లాంటిది. పీచు పదార్థం పుష్కలంగా ఉండి, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఈ అద్భుతమైన వంటకం.. కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యంలోనూ మేటి. మరి మరుగున పడిపోతున్న మన ప్రాచీన ‘సూపర్ ఫుడ్’ జొన్న గడకను మళ్లీ మన డైట్‌లో ఎలా చేర్చుకోవాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

READ ALSO: Ranbir Kapoor: రామాయణలో రణబీర్ ‘డబుల్’ ధమాకా.. రాముడితో పాటు ఆ పవర్‌ఫుల్ రోల్‌లోనూ ఆయనే!

దీనికి కావలసిన పదార్థాలు..

తెల్ల జొన్నలు – 2 కప్పులు

నీళ్లు – 4 కప్పులు (ఒక కప్పు రవ్వకు 4 కప్పుల నీళ్లు)

ఉప్పు – తగినంత

తయారీ విధానం ఇదే..
ముందుగా తెల్ల జొన్నలను తీసుకుని మిక్సీలో వేసి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రవ్వను పిండి జల్లెడతో జల్లించి, సన్నటి పిండిని వేరు చేయాలి. మిగిలిన బరక రవ్వ గడకకు సరైనది. తర్వాత ఒక మట్టి పాత్రను లేదా వంట పాత్రను స్టౌ మీద పెట్టి అందులో 4 కప్పుల నీళ్లు పోయాలి. అందులో తగినంత ఉప్పు వేసి, మూత పెట్టి నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి, సిద్ధం చేసుకున్న జొన్న రవ్వను వేస్తూ గరిటెతో ఉండలు కట్టకుండా బాగా కలపాలి. మూత పెట్టి సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. నీరంతా పోయి గడక దగ్గర పడ్డాక స్టౌ ఆపేయాలి. ఐదు నిమిషాల తర్వాత ఇది గట్టిపడి తినడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన జొన్న గడకను పెరుగు, మజ్జిగ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ లేదా ఏదైనా కూరలతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

ప్రయోజనాలు ఇవే..
జొన్నల్లో ‘గ్లైసెమిక్ ఇండెక్స్’ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. షుగర్ వ్యాధి ఉన్నవారు అన్నానికి బదులుగా జొన్న గడకను తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే జొన్నల్లో పీచు పదార్థం అత్యధికంగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, దీనివల్ల త్వరగా ఆకలి వేయదు. అతిగా తినడాన్ని తగ్గించి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక ‘సూపర్ ఫుడ్’గా పని చేస్తుంది. జోన్నల్లో ఉన్న ఫైబర్ మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా జొన్న గడక సులభంగా అరుగుతుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే జొన్నల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తుంది. జొన్నల్లో కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు, వృద్ధులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ జొన్న గడకను పైన చెప్పినట్లు సింపుల్‌గా మీకు కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేయండి.

READ ALSO: CM Chandrababu: అమరావతి నిర్మాణంలో రాజీ పడొద్దు.. నిర్మాణ సంస్థలకు సీఎం ఆదేశాలు!

Exit mobile version