Jonty Rhodes Says Ravindra Jadeja is Best Fielder in the World: భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు తాను పెద్ద అభిమానిని అని ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్‌గా పేరొందిన జాంటీ రోడ్స్ తెలిపారు. రైనా క్రికెట్ ఆడిన రోజులను తాను ఎంతో ఆస్వాదించానన్నారు. రవీంద్ర జడేజా మైదానంలో ఎక్కడైనా ఫీల్డింగ్ చేయగలడని, జడ్డూ ‘కంప్లీట్ ఆల్‌రౌండ్ ఫీల్డర్’ అని పేర్కొన్నాడు. మంచి ఫీల్డర్‌గా మారడానికి చేతులతో సంబంధం లేదని, కాళ్లకు సంబంధించినది జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు. 1992 నుండి 2003 వరకు దక్షిణాఫ్రికా తరఫున 52 టెస్టులు, 245 వన్డేలు ఆడారు.
శనివారం హీరో ప్రో కార్పొరేట్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా జాంటీ రోడ్స్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జాంటీ రోడ్స్ మాట్లాడుతూ… ‘నేను సురేశ్ రైనాకు పెద్ద అభిమానిని. అతను క్రికెట్ ఆడిన రోజులను చాలా ఆస్వాదించాను. కానీ ఇప్పుడు అతను రిటైర్ అయ్యాడు. కొన్నాళ్ల క్రితం భారత్‌లో క్రికెట్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు సరిగా లేవు. మంచి మైదానం కోసం రైనా వెతుకుతుండేవాడు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. మంచి మైదానాల్లో ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్ ఆడాను. ప్రస్తుతం ప్రపంచంలోనే రవీంద్ర జడేజా అత్యుత్తమ ఫీల్డర్. జడ్డూ వేగంగా డైవ్ చేయడు. అతను బంతి వైపు చాలా వేగంగా పరుగెత్తుతాడు. బంతిని సరిగ్గా స్టంప్స్‌పైకి విసురుతాడు. బౌండరీ లైన్, సర్కిల్ మైదానంలో ఎక్కడైనా అతడు ఫీల్డింగ్ చేయగలడు. జడేజా కంప్లీట్ ఆల్‌రౌండ్ ఫీల్డర్’ అని అన్నారు.
Also Read: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
‘మంచి ఫీల్డర్‌గా మారడానికి చేతులతో సంబంధం లేదు, కాళ్లకు సంబంధించినది. వేగంగా పరుగెత్తితేనే సరైన సమయంలో బంతిని అందుకోవచ్చు. క్యాచ్‌లు బాగా పట్టే నైపుణ్యం ఉన్నా.. వేగంగా పరుగెత్తలేకపోతే లాభం లేదు. శరీరం వేగంగా కదలడం, టెక్నిక్‌కు సంబంధించినది. నాకు ఇప్పుడు 55 ఏళ్లు. ఇప్పటికీ డైవ్ చేయడానికి ఇబ్బంది లేదు కానీ.. ల్యాండింగే పెద్ద సమస్య. నేను క్రికెట్ ఆడే రోజుల్లో డైవ్ చేయాలా? వద్దా? అనే దాని గురించి అస్సలు ఆలోచించేవాడిని కాదు. అదే నన్ను విజయవంతం చేసింది’ అని జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చారు.
