NTV Telugu Site icon

Gautam Gambhir: గంభీర్‌ పూర్తి పదవీకాలంలో ఉండటం కష్టమే.. భారత మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు!

Gautam Gambhir

Gautam Gambhir

Joginder Sharma on Gautam Gambhir: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ శ్రీలంక పర్యటనతో భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గంభీర్‌ మార్గనిర్ధేశంలో లంక పర్యటనలో టీ20 సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్‌పై కన్నేసింది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితో మాట్లాడుతూ ప్రోత్సహిస్తున్న గంభీర్‌పై భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముక్కుసూటిగా మాట్లాడే గౌతీ పూర్తి పదవీకాలంలో కోచ్‌గా ఉండటం కష్టమే అని అభిప్రాయపడ్డాడు. అవతలి వ్యక్తిని పొగడ్తలతో బుట్టలో వేసేద్దామనే స్వభావి కాదన్నాడు.

శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్‌లో జోగిందర్ శర్మ మాట్లాడుతూ… ‘భారత జట్టును నడిపిస్తున్న గౌతమ్‌ గంభీర్‌ హెడ్ కోచ్‌ పదవిలో ఎక్కువ కాలం ఉండే అవకాశం చాలా తక్కువ. ఇలా అంటున్నానని అతడిపై వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ఈర్ష్య లేదు. గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకొనే వ్యక్తి. ఒక్కోసారి జట్టులోని ఆటగాళ్ల అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు. ఇక్కడ విరాట్ కోహ్లీ గురించి చెప్పడం లేదు. ఇతర ప్లేయర్స్ కూడా గంభీర్‌ నిర్ణయాలను ఇష్టపడకపోవచ్చు. గౌతీ ఏదైనా సరే నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. అవతలి వ్యక్తిని పొగడ్తలతో బుట్టలో వేసేద్దామనే స్వభావి కాదు. ఏ పనినైనా నిబద్ధతతో చేస్తాడు. నిజాయతీ కలిగిన వ్యక్తి. అందుకే గౌతీ పూర్తికాలం హెడ్ కోచ్ పదవిలో ఉండకపోవచ్చు’ అని అన్నాడు.

Also Read: Ambati Rayudu: ఏదీ అవసరం లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థనను తిరస్కరించిన అంబటి రాయుడు!

2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో చివరి ఓవర్‌ వేసి అందరి మదిలో నిలిచిపోయిన బౌలర్ జోగిందర్‌ శర్మ. టీ20 ప్రపంచకప్‌తో చాలా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత జట్టులో అవకాశాలు రాకపోవడంతో క్రమంగా ఆటకు దూరమయ్యాడు. జోగిందర్‌ భారత్ తరఫున 4 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ప్రస్తుతం హరియాణా పోలీస్‌ శాఖలో డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.