Jogi Ramesh Open Challenge: ఏపీ ఫేక్ లిక్కర్ కేసు కాకరేపుతోంది.. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు బయటకు రావడంతో ఆసక్తికరంగా మారగా.. నేను లై డిటెక్టర్ టెస్ట్ రెడీ.. మీరు సిద్ధమా? అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు జోగి రమేష్ సవాల్ చేశారు.. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన జోగి రమేష్.. తనపై సోషల్ మీడియా, కొన్ని మీడియా ఛానెల్స్ లో వచ్చే ఫేక్ వార్తలపై ఫిర్యాదు చేశారు.. జోగి రమేష్‌తో పాటు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి , రమేష్ యాదవ్ , వరుదు కళ్యాణి , పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు ఉన్నారు.. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. ఫేక్ బాబు ఫేక్ న్యూస్ తో రోజుకొక అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారు.. చంద్రబాబు విన్యాసాలు రాష్ట్ర ప్రజలు గమనించాలి.. నేను వాట్సాప్ లో ఛాట్ చేశానని ఓ ఫేక్ ప్రచారం చేశారు.. ఎల్లో మీడియా ఆ ఫేక్ ప్రచారం పై డిబేట్లు పెట్టింది అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: Shocking Murder: ఇన్సూరెన్స్ పైసల కోసం.. మరీ ఇంతకు తెగిస్తారా..
నా సెల్ ఫోన్లు.. చంద్రబాబు, లోకేష్ కు ఇస్తా.. మీడియా సమక్షంలో ఏ అధికారికి ఇవ్వమన్నా నా సెల్ ఫోన్లు ఇస్తా అని సవాల్ చేశారు జోగి రమేష్.. రిమాండ్‌లో ఉన్న జనార్థనరావుతో ఓ వీడియో చేయించారని విమర్శించారు. అయితే, లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధంగా ఉన్నా.. చంద్రబాబు, లోకేష్ కు రెండు రోజులు టైమిస్తున్నా.. నా సవాల్ కు చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. టీడీపీ నేతలను కూడా కోరుతున్నా చంద్రబాబు, లోకేష్ తో మాట్లాడించి ఒప్పించండి.. జోగి రమేష్ మాట తప్పడు.. మడమ తిప్పడు అన్నారు.. ఎంత దిగజారిపోయావ్ చంద్రబాబు.. ప్రజలు నిన్ను గెలిపించి అధికారం ఇస్తే.. నీ అధికారాన్ని నన్ను లోపల వేయడానికి వాడుతున్నావ్.. అంటూ ఫైర్ అయ్యారు.. నన్ను ఇరికించాలని చూసి చంద్రబాబు పప్పులో కాలేశాడు.. ఇబ్రహీంపట్నంలో పుట్టినంత మాత్రాన జనార్థనరావుతో నాకు సంబంధం ఉన్నట్లేనా? అని ప్రశ్నించారు..
సీబీఐ వేయమంటే వేయవు.. గుడిలో ప్రమాణస్వీకారానికి రమ్మంటే రావు ఇదేంటి? అని ప్రశ్నించారు.. జోగి రమేష్ తెరిచిన పుస్తకం.. మీకు దమ్ముంటే మా ఇంటికి విచారణకు రండి అని సవాల్ చేశారు.. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు.. చంద్రబాబు చెప్పినట్లు నా పై ప్రచారాలు చేస్తే దేవుడు మిమ్మల్ని క్షమించడు అని హెచ్చరించారు.. సిట్ అధికారులను కూడా కోరుతున్నా నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయండి అని విజ్ఞప్తి చేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్.
