Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ‘జో రూట్’ ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!

Joe Root

Joe Root

Joe Root: ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బెన్ స్టోక్స్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అధికారికంగా ప్రకటించింది. టెస్ట్ జట్టుకు జో రూట్‌ను కెప్టెన్‌గా, మాజీ న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది.

మరోసారి కెప్టెన్‌గా జో రూట్:

జో రూట్‌కు ఇది టెస్ట్ కెప్టెన్‌గా రెండో ఇన్నింగ్స్. 2017 నుంచి 2022 వరకు ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించిన రూట్, అనంతరం బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. ఇప్పుడు స్టోక్స్ రిటైర్మెంట్‌తో మరోసారి రూట్‌కే ఆ బాధ్యతలు అప్పగించింది ECB. అయితే హ్యారీ బ్రూక్ పేరును కూడా కెప్టెన్సీ కోసం పరిశీలించినప్పటికీ.. మూడు ఫార్మాట్లలో అతనిపై అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో రూట్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

విజయవంతమైన టెస్ట్ కెప్టెన్:

జో రూట్ ఇంగ్లండ్ టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. అతను 65 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా.. వాటిలో 27 విజయాలు సాధించి అత్యధిక టెస్ట్ విజయాలు అందించిన ఇంగ్లండ్ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కొత్త కెప్టెన్‌గా రూట్‌కు తొలి సవాల్ స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగే మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కానుంది.

హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్:

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న ఫ్లెమింగ్, ఇప్పుడు ఇంగ్లండ్ రెడ్‌బాల్ జట్టుకు బాధ్యతలు చేపట్టనున్నాడు. ఫ్లెమింగ్ మార్గదర్శకత్వంలో CSK ఐదు ఐపీఎల్ టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023) గెలుచుకుంది. అలాగే ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఫ్లెమింగ్ ఒకరిగా గుర్తింపు పొందాడు.

ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవికి ఆండీ ఫ్లవర్, జస్టిన్ లాంగర్, జోనాథన్ ట్రాట్, కుమార సంగక్కర వంటి ప్రముఖుల పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. అయితే చివరకు ECB డైరెక్టర్ రాబ్ కీ ఫ్లెమింగ్ వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు పాకిస్థాన్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ముందు జట్టులోని లోపాలను సరిదిద్ది, మెరుగైన ప్రదర్శన చేయించడం ఫ్లెమింగ్ ముందున్న తొలి సవాల్ కానుంది.